నల్లగొండ, మార్చి 26 (నమస్తే తెలంగాణ)/నేరేడుచర్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌పై నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో మూడు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు మంగళవారం మూడు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లోనూ ఒక్కో కేసులో ఒక్కొక్కరిని ఏ1గా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను వర్తింపచేస్తూ నమోదు చేసిన కేసులో కేటీఆర్‌ను ఏ1గా చేర్చారు. మూడు కేసుల్లోనూ కేటీఆర్‌తోపాటు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌ను నిందితులుగా చేర్చారు. ఒక కేసులో తెలుగు స్ర్కైబ్‌ను, మిర్రర్ టీవీని, మరో కేసులో టీన్యూస్ యజమాన్యాన్ని, తెలుగు స్ర్కైబ్‌ను కలిపి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. నకిరేకల్‌లో పదో తరగతి పరీక్ష మాల్ ప్రాక్టీస్ కేసు వ్యవహారంలో పోలీసులు ఇద్దరు మైనర్లతోపాటు 11 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులోని కీలక నిందితులు స్థానిక అధికార పార్టీ నేతల అనుచరులు అంటూ వారు వివిధ సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఇతర నేతలతో సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని పలు వెబ్సైట్లతో పాటు యూట్యూబ్ చానళ్లు ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రచురించాయి. ఓ వెబ్ న్యూస్ సంస్థ ప్రచురించిన కథనం ఆధారంగా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిందితులతో తమకు సంబంధం లేకున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు పోలీస్‌స్టేషన్ మెట్టు ఎక్కారు. మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, కాంగ్రెస్‌నేత ఉగ్గిడి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నకిరేకంటి నరేందర్ ఒకే విషయంలో వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు. తమ పరువుకు భంగం కలిగిందని, తమ సామాజికవర్గంలో తమను తప్పుగా చూసే ప్రమాదం ఉందని, అందుకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వేర్వేరు ఫిర్యాదుల వెనుక స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పకడ్బందీ ప్లాన్ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రకారమే పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేస్తూ ఒక్కో కేసులో ఒక్కొక్కరిని ఏ1గా ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు.
కేటీఆర్‌పై అక్రమ కేసులు దుర్మార్గం :చిరుమర్తి లింగయ్య
పదో తరగతి పేపర్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కుమార్‌పై పెట్టిన అక్రమ కేసులు దుర్మార్గమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులతో గొంతు నొక్కాలని చూస్తే అంతకు రెట్టింపు స్వరంతో ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీయడం ఖాయమని హెచ్చరించారు. బుధవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో చిరుమర్తి మాట్లాడారు. నకిరేకల్‌లో పదో తరగతి పరీక్షల తొలి రోజే పేపర్ లీక్ చేసే కుట్రలకు స్థానిక స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తెరలేపారని, ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యంతో కుమ్మక్కై భారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇది బహిర్గతమై రచ్చకెక్కడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.