కట్టంగూర్, ఫిబ్రవరి 23 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్లలో ఆదివారం ఆయన రైతు బీమనబోయిన భిక్షంకు చెందిన ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సకాలంలో కరెంట్ ఇవ్వకపోవడం, కింది ప్రాంతాలకు ఏఎమ్మార్పీ, మూసీ నుంచి సాగునీరు విడుదల చేయకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హయాం లో సాగునీరు లేక, కరెంట్ సకాలంలో రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కండ్ల ముందే ఎండిపోతున్న పంట పొలాలను రైతులు కాపాడుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కూడా సగం మంది రైతులకు రైతుభరోసా ఇవ్వలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పాడి పంటలతో సంతోషంగా ఉన్న రాష్ర్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీడు భూములుగా మార్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ పంటలను తామే కాల్చుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రతి రైతు ఎకరానికి రూ.35 వేల చొప్పున పెట్టుబడులు పెట్టి కరువుతో తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఎకరానికి రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.