హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చైనా మాంజాను అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్, అటవీ దళాల ప్రధాన అధికారిణి డాక్టర్ సీ సువర్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం అరణ్యభవన్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చైనా మాంజా వల్ల మనుషులు, పక్షులు, వన్యప్రాణులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నైలాన్, సింథటిక్ వంటి ప్రమాదకరమైన ధారాలు ఏ రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతున్నాయో గుర్తించి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.
ఇటీవల పలువురు ద్విచక్ర వాహనదారులు మృత్యువాతపడ్డారని చెప్పారు. టూరిజం, జీహెచ్ఎంసీశాఖ చైనా మాంజా ప్రమాదాలపై హెచ్చరిక బోర్డులు పెట్టాలని సూచించారు. చైనా మాంజా విక్రయ దుకాణాలు, గోదాములపై దాడులు నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఐఅండ్ పీఆర్, బయోడైవర్సిటీ బోర్డు, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.