జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : గోదావరి కాంగ్రెస్ సర్కార్‌కు ఓ పిక్నిక్ స్పాట్‌లా మారింది. పునరుద్ధరణ కమిటీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మరోసారి మేడిగడ్డ టూర్‌కు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీ పీసీసీ హోదాలో రాహుల్‌గాంధీతో ఒకసారి, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగంతో మరోసారి, ఇప్పుడు మూడోసారి మేడిగడ్డ రానున్నారు. విచారణ, పరీక్షల పేరుతో బరాజ్‌కు మరమ్మతులు చేయకుండా రెండున్నరేండ్లుగా కాలయాపన చేసి రేవంత్‌రెడ్డి.. రైతాంగం నుంచి వ్యతిరేకత రావడం, కరువు తరముకొస్తుండటంతో రిపేర్లు చేసి ఉపయోగంలోకి తీసుకొస్తామని కలరింగ్ ఇస్తూ మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ బాట పడుతున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం పునరుద్ధరణ కోసం 9మందితో కమిటీ ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బరాజ్ పనులను ప్రారంభించడానికి రావాలే తప్ప పరిశీలించేందుకు ఇంకా ఎన్నిసార్లు వస్తారని రైతులు మండిపడుతున్నారు.
సర్కార్ యాత్రలపై విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన ఫిల్లర్‌ను పరిశీలించి అక్కడే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా ప్రాజెక్టు గురించి అర్థం కానట్టు మళ్లీ విహారయాత్రలా టూర్ వేశారు. 2023 డిసెంబర్ 29న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోటి మంత్రులతో కలిసి మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మళ్లీ 2024 ఫిబ్రవరి 11న సీఎం తన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగంతో దండయాత్రకు వెళ్లినట్టుగా మేడిగడ్డకు చేరుకొని మరోమారు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ టూర్లు బరాజ్ మరమ్మతు దిశగా సాగకపోవడం, కేవలం బీఆర్ఎస్ను బదనాం చేసేలా ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు భగ్నం చేసి ప్రజలు, రైతులకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హారీశ్‌రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి 2024 మార్చి 1న మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను సందర్శించి రేవంత్ అండ్ బ్యాచ్ అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
భారీ శబ్దంపై విచారణ ఏది ?
మేడిగడ్డ బరాజ్‌లో 2023 అక్టోబర్ 21న రాత్రి భారీ శబ్దం వచ్చి 7వ బ్లాక్‌లో 20వ ఫిల్లర్ కుంగింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు అక్టోబర్ 24న రెండు రాష్ర్టాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక కుట్ర కోణం ఉన్నదని ఇరిగేషన్ ఏఈఈ రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పోలీసు విచారణను గాలికొదిలేసింది. 2023 నవంబర్ 2న రాహుల్‌గాంధీ రేవంత్‌రెడ్డితో కలిసి ఆగమేఘాలపై అంబట్పల్లిలో మహిళా సదస్సు పేరుతో మేడిగడ్డను సందర్శించి ఎక్స్‌ప్యాన్షన్ జాయింట్ చూసి పగుళ్లుగా చిత్రీకరించి అభాసుపాలయ్యారు. ఎన్నికల సమయంలో ఈ ఘటన జరుగడం రాహుల్, రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో కుట్ర కోణం దాగి ఉన్నదనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అదీగాక బరాజ్ వద్ద ఉండే పోలీస్ బందోబస్తును కూడా తొలగించింది. ఇప్పుడు రెండున్నరేండ్ల తర్వాత సీఎం మళ్లీ మేడిగడ్డకు వచ్చి మరమ్మతులు చేయిస్తాననే నాటకంపై రైతులు మండిపడుతున్నారు.
మళ్లీ కమిటీ పేరుతో కాలయాపన
రెండున్నరేండ్లుగా కమిటీలు, విచారణ, పరీక్షల పేరుతో కాలయాపన చేసిన రేవంత్ సర్కార్ మళ్లీ కమిటీ పేరుతో డ్రామాకు తెరలేపింది. ఇప్పటికే రైతులు సాగు, తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లింకుల ద్వారా గోదావరి జలాలు ఎగువకు తరలివెళ్తున్నాయి. ఇక కాళేశ్వరమే కరువుకు ప్రత్యామ్నాయమని భావించిన సర్కార్ తన తప్పును ఒప్పుకోకుండా కాళేశ్వరం పునరుద్ధరణ కమిటీని 9మందితో ఏర్పాటు చేసింది. ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిటీతో పాటు విజిలెన్స్ , ఎన్డీఎస్ఏ విచారణ, సీడబ్ల్యూపీఆర్ఎస్ తనిఖీలు ఇలా రెండున్నరేండ్లు గడిచిపోయాయి. ఇన్నాళ్లూ సోయి లేని రేవంత్ ప్రభుత్వానికి సరిగ్గా కేసీఆర్ జగిత్యాల సభ రోజునే కదలిక వచ్చింది. గతంలో కేసీఆర్ నల్లగొండ సభ సందర్భంగా రేవంత్ మేడిగడ్డ టూర్ పెట్టుకున్నారు. మేడిగడ్డకు ముందే వచ్చిన రేవంత్ నాడు తన కార్వాన్ నుంచి కిందికి దిగలేదు. నల్లగొండలో కేసీఆర్ ప్రసంగం పూర్తిగా విని అనంతరం తన కార్వాన్ దిగి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే కొనసాగుతుందని, ఉదయం కేసీఆర్ సభ జగిత్యాలలో ఉండగా అక్కడి ప్రసంగం విన్న తర్వాత మేడిగడ్డ, కాటారం సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.
నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌రెడ్డి ; ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయల్దేరుతారు. 3 గంటలకు కాళేశ్వరముక్తీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అక్కడి నుంచి 3:45 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటారు. డ్యామ్ సైట్‌ను పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆతర్వాత మీడియాతో మాట్లాడుతారు. అక్కడి నుంచి సాయంత్రం 6:30 గంటలకు కాటారం మండలం నస్తురపల్లికి చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదేసభలో రెండోవిడత రైతుభరోసా నిధులు విడుదల చేస్తారు.
గవర్నర్‌తో సీఎం భేటీ
లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్శుక్లాను ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యారంగానికి సంబంధించిన అంశాలు, జూన్ 12న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంపై చర్చించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి సీఎం వెంట ఉన్నారు.