Krishna Water | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించడంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్రం బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగునీటి విడుదలపై హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని స్పష్టం చేశారు. టెలిమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అవసరమైన నిధులను ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే అమలుకు చర్యలు చేపట్టాలని కోరుతూ కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు.
మూడు నెలలు అలర్ట్‌గా ఉండాలి
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఎండలు పెరిగేకొద్ది తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పరిష్కార మార్గాలు కనుగొనాలని పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
కేటీఆర్, హరీశ్ ప్రశ్నించడంతో రివ్యూ
ఏపీ జల దోపిడీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం నిలదీయడంతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన రివ్యూ నిర్వహించారు. ఏపీ యథేచ్ఛగా కృష్ణా జలాలు తరలించుకుపోతున్నా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నెత్తి చూడటం లేదని ఇరువురు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. రేవంత్ సర్కారు మౌనంతో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్న వైనంపై ‘నమస్తే తెలంగాణ’ గత కొన్ని రోజులుగా వరుస కథనాలు ప్రచురించింది. ఆదివారం సైతం ‘ఏపీ జలదోపిడి!’ పేరిట కథనం ప్రచురితమైంది. 25 రోజులుగా రోజుకు 2 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతున్నదని సాక్ష్యాధారాలతో సహా వెల్లడించింది. వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించడంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాల వారీగా ప్రణాళికలు
ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. సాగు, తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. వేసవిలో సాగు, తాగునీటితో పాటు విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, వీటిని అందించేందుకు జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని ఆదేశించారు. సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లాలవారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకుని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీచేయాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.