Congress | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ మధ్య పదేపదే ‘పెద్దలు’ గుర్తుకొస్తున్నారనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా జరుగుతున్నది. పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యంలో నాడు వద్దనుకున్న పెద్దలే.. నేడు దిక్కవుతున్నారనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి సోమవారం మరో సీనియర్ నేత కే కేశవరావుతో కలిసి ముఖ్యమంత్రి వెళ్లడంపై ఈ చర్చ మొదలైంది. గత రెండు నెలల్లో రెండుసార్లు ఆయన జానారెడ్డికి ఇంటికి వెళ్లడంపై పార్టీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి జానారెడ్డితో కొంతకాలంగా సీఎం రేవంత్‌రెడ్డి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం పార్టీలో జరిగింది. వారిద్దరూ కలుసుకోకపోవడం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. మొదటిసారి 2023 డిసెంబర్ 11న అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జానారెడ్డిని రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు.
అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ ఆయన ఇంటికి సీఎం వెళ్లలేదు. గత నెల (మార్చి 6)న ఆకస్మికంగా సీఎం రేవంత్‌రెడ్డి జానారెడ్డి ఇంటిలో ప్రత్యక్షమయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలు వివాదాస్పదమైన నేపథ్యంలో జానారెడ్డి సలహాలు సూచనల కోసం సీఎం వెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ సోమవారం మరోసారి ఆయన జానారెడ్డి ఇంటికి వెళ్లారు. దీనిపై పార్టీ నేతల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడం, కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను కేసీఆర్ ప్రజల్లో ఎండగట్టడం, సర్కారుపై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించడంతో ప్రభుత్వపరంగా నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. అదేవిధంగా ఎప్పుడో జరుగుతుందనుకున్న మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పెద్దల సలహాలు తీసుకునేందుకు వెళ్లారనే చర్చ జరుగుతున్నది. గంటపాటు భేటీ జరిగితే ఇందులో అరగంటకు పైగా రహస్యంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. దీనిపై నాడు వద్దనుకున్న పెద్దలే.. నేడు దిక్కవుతున్నారా అనే సెటైర్లు పార్టీ వర్గాల్లో పేలుతున్నాయి.