CM KCR | రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు 14 లక్షల 10 వేల మంది పదాధికారులు ఉన్నారు. ఇప్పటివరకు 50 శాతం పని పూర్తయ్యింది. మరో 15-20 రోజుల్లో గ్రామగ్రామానికీ పార్టీని విస్తరిస్తాం. 50 యేండ్లు వాళ్లు (కాంగ్రెస్) అధికారంలో ఉన్నా దేశంలో మార్పు రాలేదు. వాళ్లే ఇప్పుడు ‘నయా ఇండియా’ అంటున్నరు. మేం ఏ కూటమిలోనూ లేము. ‘ఇండియా’ వైపు లేము. ఎన్డీయే వైపు లేము. మా మిత్రులతో మేం కలిసే ఉన్నాం. దేశంలో మార్పు దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 1 (సమస్తే తెలంగాణ): ‘మేం ఇటు ఇండియా వైపు లేము.. అటు ఎన్డీయే వైపు లేము’ అని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తాము ఎవరివైపూ లేమని, ఉండబోమని ఆయన తేల్చిచెప్పారు. మహారాష్ట్ర పర్యటన ముగించుకొని సోమవారం తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో కొల్హాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నయా ఇండియా ఏమిటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘50 సంవత్సరాలు వాళ్లు (కాంగ్రెస్) అధికారంలో ఉన్నా మార్పు రాలేదు. మార్పు జరుగాల్సి ఉంది. దేశం అందుకు సిద్ధంగా ఉంది’ అని కుండబద్దలు కొట్టారు. తాము ఒంటరిగా లేమని, మిత్రులతో కలిసి ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్రలో వివిధ స్థాయిల్లో తమ పార్టీకి సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తాము ఎన్నికల యుద్ధగంట మోగించామని కేసీఆర్ ప్రకటించారు.
మహారాష్ట్రలో ఇప్పటికే తమ పనిని ప్రారంభించామన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 లక్షల 10 వేల మంది పదాధికారులు ఉన్నారని, ఇప్పటివరకు 50 శాతం పని పూర్తయిందని చెప్పారు. మరో 15 నుంచి 20 రోజుల్లో గ్రామగ్రామాన పూర్తిస్థాయిలో పని పూర్తి చేస్తామని తెలిపారు. దేశంలో మహారాష్ట్ర లాంటి అద్భుతమైన రాష్ట్రం మరోటి లేదని, ఆ రాష్ట్రంలో అనేక వనరులున్నాయని అన్నారు. ‘మహారాష్ట్రలో సంపదకు కొదువలేదు. ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నా యి. ఔరంగాబాద్ వంటి నగరంలో నీటి ఇ బ్బందులా?’ అని నిలదీశారు. దళిత సమా జం ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. మహారాష్ట్రలో దళితులకు సరైన ప్రాధాన్యం దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా వంటి దేశం వివక్షను విడిచిపెట్టి ఒబామాను అధ్యక్షుడిని చేసి, తన పాపా న్ని కడుక్కున్నదని ఆయన గుర్తుచేశారు.