CM KCR Birthday | సీఎం కేసీఆర్ పుట్టినరోజు వాళ్లకు సంబురమైంది.. వాళ్ల ఇండ్లలో పండుగైంది.. ఆడబిడ్డలకు చీరలు పంచేటి వేడుకైంది.. సామూహిక పెండ్లిళ్లు చేసేటి సంతోషమైంది.. సేవా కార్యక్రమాలుగా, వినూత్న చిత్రపటాలుగా, పచ్చబొట్టుగా అభిమానమైంది.. పాదయాత్రలు చేసేటంతటి కార్యసిద్ధికి కారణమైంది.. ఆటలతో శుభాకాంక్షలు చెప్పేటంతటి ఆనందమైంది.. పూజలు, అభిషేకాలు చేసేటంతటి భక్తిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఒక రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ అభిమానాన్ని చాటుకొంటున్నారు.
(నమస్తే తెలంగాణ నెట్వర్క్): రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ప్రజలు తమ అభిమాన నాయకుడికి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకొంటున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ కప్ సీజన్-3 టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సినీ నటుడు నానితో కలిసి మంత్రి హరీశ్‌రావు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ వేదికపై హీరో నాని నూతన సినిమా దసరా ట్రైలర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ అంటే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకు కాదు, సిద్దిపేట వంటి పట్టణాల నుంచీ అద్భుతమైన క్రీడాకారులను తయారు చేయాలన్నదే తన ఉద్దేశమని, తెలంగాణ రథసారథి సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ టోర్నీని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నదని తెలిపారు.
140 కోట్ల దేశ జనాభాలో 11 మంది మాత్రమే క్రికెట్ ఆడుతారని, అందులో ఒకడు మన అంబటి రాయుడు అని వెల్లడించారు. రాయుడు అద్భుతమైన క్రికెటర్ అని, ఆయన గురించి తెలియని తెలుగు వారు ఉండరని అన్నారు. ఆయనకు మన సిద్దిపేటతో సంబంధం ఉన్నదని చెప్పారు. న్యాచురల్‌గా నటించే నటుడు నాని అని ప్రశంసించారు. నాని సినిమా జెర్సీని చూశానని, అందులో పట్టుదలతో జాతీయ జట్టుకు ఎంపికై ఆడుతాడని గుర్తు చేశారు.
నాని డైలాగు చెప్పినట్టు ఎట్లయితే గట్లయితది అన్నట్టు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పడు ఆందరూ ఇది ముందుకు సాగుతుందా అని హేళన చేశారని చెప్పారు. కానీ, ఎట్లయితే గట్లయితది అని పట్టుదలతో రంగంలోకి దిగి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని తెలిపారు. యువత క్రీడాస్ఫూర్తితో ఆడాలని, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. రాయుడు చెప్పినట్టు మంచి కోచ్‌లను ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో అద్భుతమైన క్రీడాకారులను తయారు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ తరహా ఆభివృద్ధి దేశంలో జరగాలని సీఎం కేసీఆర్ నేడు పెద్ద లక్ష్యంతో బయలు దేరారని పేర్కొన్నారు. అనుకున్నదాన్ని సాధించేదాకా పోరాడే నాయకుడు మన సీఎం కేసీఆర్ అని హరీశ్ అన్నారు. ప్రతి యువకుడు కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని పట్టుబడితే సాధ్యం కానిది ఏదీ లేదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ అనే పదానికి మంత్రి హరీశ్‌రావు సరికొత్త నిర్వచనం చెప్పారు. కే అంటే కారణజన్ముడు, సీ అంటే చిరస్మరణీయుడు, ఆర్ అంటే అందరి తలరాతలను మార్చిన మహానీయుడు అని తెలిపారు. అంతకు ముందు రాయుడు, నాని, హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్తో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా హీరో నాని టోర్నమెంట్‌లోని క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిక్స్ కొట్టిన వారికి రూ.వెయ్యి చొప్పున అందజేయాలని చెక్‌ను అందించారు.
పీవీ మార్గ్‌లోని సంజీవయ్య పార్క్ పక్కన ఉన్న థ్రిల్ సిటీలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ఘన ఏర్పాట్లు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవా రం ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారం భం కానున్నాయి. వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిఫ్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిఫ్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు మహమూ ద్ అలీ, మల్లారెడ్డి, ఇతర మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొననున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. నిర్వహిస్తున్నారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మెగా రక్తదాన్న శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు విప్ అరికపూడి గాంధీ తెలిపారు.
రైతులు, బీఆర్ఎస్ నాయకులు పల్లీలు, ఉల్వలతో సీఎం కేసీఆర్ చిత్రపటం వేసి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్లీలు, ఉల్వలు, ఉప్పు, రంగులతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించారు.
హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూనా ప్రదీప్‌కుమార్ ‘శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్’ అంటూ ఆవగింజలపై రాసి గులాబీ దళపతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి రావి ఆకుపై గీసిన చిత్రాన్ని జతచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం వరంగల్‌లో కేసీఆర్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ, కాకతీయ క్రికెట్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేసీఆర్ క్రికెట్ పోటీలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. కేక్ కట్ చేసి సీఎంకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ కేంద్రంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్టు వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వినయ్‌భాసర్ ఆధ్వర్యంలో మూడేండ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం బ్యాటింగ్, బౌలింగ్ వేస్తూ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
బీఆర్ఎస్వీ ఓయూ ప్రధాన కార్యదర్శి మిథు న్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అర్చక, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అర్చక, ఉద్యోగుల సమస్యలను తీర్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అటు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సీఎం కేసీఆర్ గోత్రనామాలతో అర్చన నిర్వహిస్తామని డీడీఎన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆంజనేయాచార్య తెలిపారు. రేచర్ల గోత్రం, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శోభ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని అర్చకులకు సూచించారు. సేవాకార్యక్రమాలు నిర్వహించాలని టీఎస్ఐకేపీ-సెర్ప్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. మొక్కలు నాటడం, పేదలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ, దేవాలయాల్లో పూజలు చేపట్టనున్నట్టు పేర్కొన్నది.
బ్రెయిలీ లిపిలో సీఎం కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాన్ని గురువారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దేశంలో ఎవరి జీవిత చరిత్ర బ్రెయిలీ లిపిలో లేదని, తొలిసారి తెలంగాణ సాధకుడు, సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను ప్రత్యేకంగా అంధుల కోసం రూపొందించటం అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఈ పుస్తకం రావటానికి తోడ్పడిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పలు కార్పొరేషన్ల చైర్మన్లు బాలమల్లు, వేణుగోపాలాచారి, వై సతీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, దివ్యాంగులు అర్జున్, మహేందర్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పరిధిలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లాశాఖ అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీఉల్లాఖాన్ పాల్గొన్నారు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో తెలుగు టీవీ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌పై రూపొందించిన పాటను విడుదల చేశారు. జిల్లెలగూడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లపై సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్, ఎస్సీ ఉప కులాల ఐక్యవేదిక, మాదిగ హక్కుల దండోరా సంయుక్తంగా సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించారు. కవాడిగూడలోని అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పద్మారావునగర్‌లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ‘తెలంగాణ బ్రాహ్మణ సమితి’ ఆధ్వర్యంలో రుద్రసహిత శ్రీ దక్షిణామూర్తి హోమం, లక్ష్మీసుదర్శన యాగం, చండీయాగం నిర్వహించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలో దివ్యాంగులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ యువనేత సాయివికాస్ గురువారం పాదయాత్ర చేపట్టారు. పట్టణంలోని వేంకటేశ్వర ఆలయం నుంచి వేములవాడలోని అగ్రహారం ఆంజనేయస్వామి ఆలయం దాకా నడకబాట పడ్డారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పుస్తక పఠనం ద్వారా సూర్యాపేట జిల్లా మునగాలలోని సాయిగాయత్రి విద్యాలయ విద్యార్థులు సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్(వీఏవోఏ) కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఉద్యోగులు సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
సామూహిక వివాహాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో 6 నిరుపేద జంటలకు పెండ్లిళ్లు చేశారు. పుస్తె, మట్టెలు, నూతన వస్ర్తాలు అందజేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వందేండ్లు వర్ధిల్లాలని శ్రీనివాస కల్యాణం జరిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ముడని అన్నారు. ఇప్పుడు దేశానికి కేసీఆర్ అవసరం ఉన్నదని, ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా ఆయనను కోరుకుంటున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా మహిళలకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కానుకలు అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మహిళలకు 23వేల చీరలు పంపిణీ చేశారు. కోలేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. చీరలు పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలుసుకొన్న మహిళలు పెద్ద సంఖ్యలో దామోదర్ నివాసానికి చేరుకోగా, ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. చీరల పంపిణీ అనంతరం కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌ను దేశమంతా కోరుకుంటున్నదని వెల్లడించారు.
‘అబ్కీ బార్-కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని ఇచ్చి దేశం గుణాత్మక మార్పు చెందాలని బలంగా ఆకాంక్షిస్తున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దేశానికి ఆశాకిరణంగా నిలిచారని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. శాంతియుతంగా తెలంగాణను సాధించి అనతికాలంలో రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్‌కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవీన భారతాన్ని నిర్మించేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్‌కు తెలంగాణ సమాజం వెన్నుదన్నుగా నిలిచిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఆయన సాగిస్తున్న ప్రయాణం అప్రతిహతంగా సాగాలని నామా ఆకాంక్షించారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన నిజాంపేట్ సతీశ్‌రెడ్డి అనే యువకుడు తన కుడి చేతిపై కేసీఆర్ పచ్చబొట్టును వేయించుకొన్నాడు. వృత్తిరీత్యా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సతీశ్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ అంటే చిన్నప్పటి నుంచి అభిమానమని తెలిపాడు.