CM KCR | సిద్దిపేట, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టినవాళ్లే నేడు మన రాష్ర్టాన్ని పొగుడుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అందరూ అసూయపడేలా అభివృద్ధి చేశామని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ భూములకు ధరలు పడిపోతాయని సమైక్యవాదులు బెదిరించారని, నేడు వాళ్లే తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని చెప్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పటాన్చెరులో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. 9 ఏండ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో దేశానికి దిక్సూచిగా అభివృద్ధి చేశామని, ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు.
స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ వాదనను ఎగతాళి చేసినవారే నేడు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తిట్టిన నోళ్లతోనే పొగుడుతున్నారని పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి సమైక్య రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబునాయుడు. ఆయన మొన్న ఓ మాట చెప్పారు.. గతంలో ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో 5- 6 ఎకరాలు కొనుక్కున్నాం.. కానీ, ఇవాళ తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పారు. అది అక్షరాలా నిజం. నేడు పటాన్చెరులో ఎకరం భూమి ధర రూ.30 కోట్లు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆంధ్రాకు పోయి వంద ఎకరాలు కొనుక్కోవచ్చు. ఈ అభివృద్ధి ఇంతటితో ఆగదు. మనకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి, ప్రజలను మంచిగా చూసుకోవాలనే తపన ఉన్నది కాబట్టి మనం ముందుకు పోతూనే ఉంటాం’ అని సీఎం పేర్కొన్నారు.
నంబర్ వన్ అనే పదానికి తెలంగాణ రాష్ట్రం అసలైన ఉదాహరణగా నిలుస్తున్నదని కేసీఆర్ అన్నారు. ‘భారతదేశం మొత్తంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఎన్ని కష్టనష్టాలను తట్టుకొని అయినా పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. నేడు మన తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు చేరింది. ఈ ప్రగతి మీ అందరి ప్రేమ, మద్దతు, దీవెనతోనే సాధ్యమైంది’ అని సీఎం అన్నారు.
తమకు మరోసారి అధికారం ఇస్తే పటాన్‌చెరుకు మెట్రోరైల్ వచ్చేలా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘ఈ జిల్లాలో మంత్రిగా పనిచేస్తూ నేను గతంలో పటాన్‌చెరుకు వచ్చిన. సంగారెడ్డి గెస్ట్ హౌస్‌లోనే ఉంటూ మూడు రోజులపాటు గల్లీగల్లీ పాదయాత్ర చేసిన. ఇక్కడి సమస్యలన్నీ నాకు తెలుసు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో నేడు అభివృద్ధిలో పటాన్చెరు దూసుకుపోతున్నది. పటాన్‌చెరుకు మెట్రోరైల్ కావాలని మహిపాల్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అడిగారు. ఇక్కడికి మెట్రోరైల్ కచ్చితంగా రావాలి. మొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి పోతే మహేశ్వరం వరకు మెట్రోరైల్ కావాలని వాళ్లు కూడా అడిగారు. హైదరాబాద్‌లో అత్యధిక ట్రాఫిక్ ఉండే కారిడార్ పటాన్చెరు – దిల్సుఖ్నగర్. ఇప్పుడు హయత్‌నగర్ కూడా తోడైంది. పటాన్ చెరు నుంచి కచ్చితంగా హయత్‌నగర్ దాకా మెట్రోరైల్ రావాల్సిన అవసరం ఉన్నది. మీరు మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తే అది కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది నా వ్యక్తిగత వాగ్దానం’ అని సీఎం ప్రకటించారు.
పటాన్చెరులో రూ.200 కోట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా దీనిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి పొల్యూషన్ ఉంటది. కార్మికులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. వారికి ఇక్కడే అత్యాధునిక వైద్యం అందించేందుకు ఈ దవాఖాన అత్యంత కీలకం కానున్నది. పటాన్‌చెరుకు ఈ దవాఖాన తెప్పించిన ఘనత రాజీవ్శర్మదే’ అని కేసీఆర్ తెలిపారు.
పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరులో సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా ఏర్పాటుచేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘పటాన్చెరులో పరిశ్రమలు అద్భుతంగా నడుస్తున్నాయి. మెడికల్ డివైసెస్ పార్క్‌లో కండ్ల అద్దాలు తయారుచేసే ఒక్క కంపెనీలోనే 15 వేల మంది పనిచేస్తున్నారని మహిపాల్‌రెడ్డి చెప్పారు. చాలా సంతోషం. పటాన్చెరు ఇంకా అభివృద్ధి చెందాలి. ఇక్కడికి ఐటీ పరిశ్రమను తేవడానికి రామన్నను (మంత్రి కేటీఆర్) పంపిస్తా. త్వరలో ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చేవిధంగా చర్యలు చేపడు తాం’ అని హామీ ఇచ్చారు. రామసముద్రం చెరువును సిద్దిపేట కోమటి చెరువులా సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. నీటిపారుదల శాఖ నుంచి నిధులు తీసుకొచ్చి చెరువును అభివృద్ధి చేయాలని మంత్రి హరీశ్‌రావును అప్పటికప్పుడు ఆదేశించారు.