Justice Alok Aradhe | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు తనను కట్టిపడేశాయని, సాంసృతిక వారసత్వాన్ని కొనసాగించడంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే పేర్కొన్నారు. ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన ఆయనకు సోమవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులంతా వీడ్కోలు పలికారు. మొదటి కోర్టు హాలులో జరిగిన జస్టిస్ అరాధే ప్రసంగిస్తూ.. అత్యున్నతమైన తెలంగాణ సాంస్కృతిక వారసత్వా న్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించా రు. హైకోర్టులో మహిళా న్యాయమూర్తులు అధిక సంఖ్యలో ఉండటం మంచి పరిణామమని చెప్పారు. హైకోర్టు కార్యకలాపాల నిర్వహణ, కేసుల విచారణలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
కాబోయే యాక్టింగ్ చీఫ్ జస్టిస్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ మాట్లాడుతూ.. జస్టిస్ అరా ధే సేవలు ఎనలేనివని కొనియాడారు. కొవిడ్ సంక్షోభ సమయంలో కేసుల విచారణ కోసం మొదలు పెట్టిన ఆన్లైన్ విధానాన్ని తర్వాత కూడా కొనసాగించారని, రాష్ట్రంలోని కోర్టులను డిజిటలైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారని, లోక్ అదాలత్ కేసుల పరిషారంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని శ్లాఘించారు. కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ బీ నరసింహశర్మ, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జీ ప్రవీణ్ కుమార్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఏ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ అలోక్ అరాధేని ఘనంగా సత్కరించారు.