గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తికర మలుపులు తిరుగుతున్నది. వాస్తవానికి ఈ ప్రక్రియపై ఆది నుంచి అన్ని రాష్ర్టాలు అప్రమత్తంగానే ఉన్నాయి. గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతనే కావేరీ లింకు ప్రాజెక్టు చేపట్టాలని తేల్చి చెప్పింది. అయితే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో 2024, జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై వేగాన్ని పెంచింది.
డీపీఆర్ తయారు చేయడంతోపాటు అనేక సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్ చకాచకా రెండు ప్రాజెక్టులను చేపడుతున్నది. తమిళనాడులోని కావేరీకి గోదావరిజలాలను తరలించుకుపోయే గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఛత్తీస్‌గఢ్ కేటాయింపులు.
ఇప్పటివరకు ఆ రాష్ట్రం వినియోగించుకోని 147.86 టీఎంసీలలో 141.4 టీఎంసీలు, మిగులు జలాల్లో మరో 106 టీఎంసీలను గోదావరి-కావేరీ ప్రాజెక్టు కింద తరలించుకుపోతామని, దీని ప్రాతిపదికననే ఈ అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు ఎన్‌డబ్ల్యూడీఏ తన నివేదికలో పొందుపరిచింది. కానీ తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లతో రెండు ప్రాజెక్టులను చేపట్టి ఆ మేరకు తమ కేటాయింపుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతి కూడా ఇచ్చినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించారు.
కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం ఏటా గోదావరిలో వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93 శాతంగా ఉంటుంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతిని కట్టడి చేయడమంటే ఇప్పుడు దిగువకు వస్తున్న నీటిలో పావు వంతు నీళ్లు ఇక ముందు రావని తేలిపోయింది. ఇక, మిగిలిందల్లా మిగులు జలాలు! అసలు గోదావరిలో మిగులు ఉందా? లేదా? అనేది నేటికీ శాస్త్రీయంగా తేలలేదు. ఇదే సమయంలో తెలంగాణకు కేటాయించినది 968 టీఎంసీలు.
ఇందులో ఎస్సారెస్పీ-90, దేవాదుల-38 టీఎంసీలు, సీతారామ-70 టీఎంసీలు, సమ్మక్క బరాజ్-50 టీఎంసీలు, కాళేశ్వరం, ఇతరత్రా ప్రాజెక్టులు కలుపుకుంటే 600 టీఎంసీలకు పైగా వినియోగించుకున్నాం. కానీ మేడిగడ్డను పునరుద్ధరించకపోవడంతో వినియోగం 400 టీఎంసీల పైచిలుకు మాత్రమే ఉంది. అంటే మన కేటాయింపుల్లో ఇంకా 400-500 టీఎంసీలు దిగువన సముద్రంలోకి పోతున్నాయి. వీటిని కూడా కేంద్రం, చంద్రబాబు వృథాజలాలుగా పరిగణించి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. చంద్రబాబు చెప్పే మాటల్లో ఏమాత్రం నిజం లేదు. తెలంగాణకు అన్యాయం చేయనంటూనే తీవ్ర అన్యాయానికి పాల్పడుతున్నాడు. బాబు మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నమ్మితే మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
ఆంధ్రలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అది బీజేపీ సర్కారుకు మిత్రపక్షం. మోదీ పదవికి ప్రాణవాయువు. ఇదే అదనుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రం ఆంధ్రకు అత్యధిక ప్రయోజనం చేకూర్చేందుకు బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. తమిళనాడులో రాజకీయ ప్రయోజనం కోసం ఎదురుచూస్తున్న మోదీకి కూడా లాభం చేకూర్చేలా గోదావరి జలాలను కావేరిలోకి మళ్లించేలా ఎత్తుగడ వేశారు. బేసిన్లు, వాటాలు, ట్రిబ్యునళ్లతో సంబంధం లేకుండా గోదావరి నీళ్లను కొల్లగొట్టే పథకం పన్నారు. ఇదీ ఏపీపై చంద్రబాబు విజన్!
కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నదీ బీజేపీ ప్రభుత్వమే. అయినా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ రాజీపడలేదు. వెంటనే అప్రమత్తమయ్యారు. బనకచర్లతో ఛత్తీస్‌గఢ్‌కు నష్టమని ఆయన కేంద్రానికి విస్పష్టంగా చెప్పారు. అంతటితో ఆగలేదు.. పార్టీ మాది అయితేనేం, కేంద్ర ప్రభుత్వం ఏదైతేనేం.. మా ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి నీళ్లను ఎవరో ఎత్తుకుపోవడం ఏమిటి? మనమే ప్రాజెక్టు కట్టుకుంటే పోలా? అని ఆలోచించారు. తక్షణమే రూ.29 వేల కోట్లతో బోథ్ఘాట్ ఆనకట్ట, రూ.20 వేల కోట్లతో మహానది-ఇంద్రావతి లింకు ప్రాజెక్టులను తయారు చేశారు. 359 గ్రామాల పరిధిలోని 9.45 లక్షల ఎకరాలకు తాగు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం 140 టీఎంసీల వరకు వినియోగించుంటామని కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచారు. ఇందుకు కేంద్రం సైతం అనుమతినిచ్చిందని ప్రకటించారు. ఇదీ ఛత్తీస్‌గఢ్ ప్రయోజనాల పట్ల బీజేపీ సీఎంకు ఉన్న కమిట్మెంట్!
కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఏపీలో ఉన్నది తెలంగాణ బద్దవ్యతిరేక చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం. తెలంగాణలో ఉన్నది బీజేపీ, తెలుగుదేశం పార్టీల వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ ఏం చేస్తున్నడు? బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసీ మీనమేషాలు లెక్కబెడుతున్నడు. ఏపీకి హక్కులుంటయ్.. చంద్రబాబును చర్చలకు పిలుస్తా.. మా నీళ్లు వాడుకోవడానికి తెలంగాణకు చంద్రబాబు అనుమతిస్తే బనకచర్లను ఆమోదిస్తా.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నడు. గోదావరి నీళ్లను వాడుకోగలిగే మేడిగడ్డకు ఏడాదిన్నరగా మరమ్మతు చేయకుండా, ఛత్తీస్‌గఢ్ లాగా మరిన్ని నీళ్లు వాడుకునేందుకు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయకుండా పరోక్షంగా గోదావరిని ఏపీకి అక్కడి నుంచి తమిళనాడుకు తరలించుకుపోయేందుకు పరోక్షంగా సహకరిస్తున్నడు. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఉన్న సోయి!