వికారాబాద్, జూలై 25 : దేశంలో సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న నీట్ లీకేజీ నిరసనలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై మన దేశంలో కాబట్టి లాఠీచార్జీ మాత్రమే చేశారని, ఇతర దేశాల్లోనైతే కాల్చిపడేసేవారని వివాదాస్పదంగా మాట్లాడారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ ఘోరమైన తప్పిదమని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి కారకులపై చర్యలకు పూనుకున్నట్టు తెలిపారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పారు. నీట్‌పై సీజేపీ(కాక్రోచ్ జనతా పార్టీ) చేస్తున్న నిరసనల్లో విద్రోహ శక్తులు ఉన్నట్టు ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే రిజల్ట్ ఆపేసి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు న్యాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నీట్ లీకేజీతో విద్యార్థులకు బాధ లేదని, కోట్లు ఖర్చు చేసి పేపర్ కొన్నవారికే బాధంతా అని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యలపై విద్యార్థులు కాకుండా, రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో 170 పేపర్ లీకేజీలు జరిగినట్టు గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంకగాంధీ.. విద్యార్థి ఉద్యమాల్లో రాజకీయం తగదంటూనే, ఆమె ఉద్యమంలో పాల్గొని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘వీరి ఉద్దేశం నీట్ పరీక్ష కాదని, ప్రధాని మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యమం లో ధనవంతులు పాల్గొంటుండగా, ఇతర దేశాల నుంచి నిధులు సమకూరుసున్నా రు. ఉద్యమంలో నీట్ రాసిన వారు కా దు.. యూనివర్సిటీ విద్యార్థులు, గూండా లు పాల్గొంటున్నారు’ అని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రధాని సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.