జగిత్యాల : జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమం ద్వారా విద్యార్థుల సామర్థ్యాల ( Students skills ) సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ( Collector Satya Prasad ) సూచించారు.గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని మండలాల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అకడమిక్ ప్యానెల్ టీం సభ్యులతో నెలవారీ సామర్థ్యాల సాధన పరీక్షల ఫలితాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు భాషా, గణిత అంశాల్లో నిర్దేశిత సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు సమర్థవంతంగా బోధించాలని అన్నారు. ముఖ్యంగా రెండో, మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అభ్యసన స్థాయిని మెరుగుపరచాలని సూచించారు. మిడ్లైన్ పరీక్షల నాటికి జిల్లాలో 80 శాతం ప్రగతి సాధించేలా అన్ని పాఠశాలల్లో కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
నెలవారీ సామర్థ్యాల సాధన పరీక్షల్లో తక్కువ ప్రగతి నమోదైన మండలాలు, స్కూల్ కాంప్లెక్స్‌లపై సమీక్ష నిర్వహిస్తూ వెనుకబాటుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.