బూర్గంపహాడ్, అక్టోబర్ 01 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో కొల్లు చెరువు సమీపంలో చేపట్టిన గోదావరి కరకట్ట సర్వే పనులను కొల్లుచెరువు సొసైటీ సభ్యులు గురువారం అడ్డుకున్నారు. కరకట్ట నిర్మాణ పనులకు సంబంధించి కొల్లుచెరువు ప్రాతంలో సర్వేయర్ సంజీవ్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తుండగా కొల్లుచెరువు తమ జీవనాధారమని, ఈ సర్వే పనుల్లో కొల్లుచెరువును కోల్పోతే ఎప్పటి నుంచో ఇక్కడ చేపలు పెంచుతూ జీవనం సాగిస్తున్న తమకు జీవనాధారం కోల్పోతామని, తమ కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రాంతంలో సర్వే నిలిపివేసి కొల్లుచెరువు సర్వేలో పోకుండా చూడాలని డిమాండ్ చేశారు. చెరువును కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, సర్వేలో కొల్లుచెరువును కోల్పోతే తమకు ప్రభుత్వం నుండి పరిహారం అందేలా చూడాలని సొసైటీ సభ్యులు సర్వేను అడ్డుకోవడంతో తాత్కాలికంగా సర్వే పనులు నిలిపివేశారు. సర్వేను అడ్డుకున్న వారిలో సొసైటీ అధ్యక్షుడు గుండె నర్సింహారావు, సభ్యులు బిళ్లకంటి పాపయ్య, గోనెల వెంకటేశ్వర్లు, బొగ్గుల సతీష్, చంద్రయ్య సభ్యులు, రైతులు ఉన్నారు.