మన్సూరాబాద్, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో చేనేత కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు. చేనేత కార్మికుల సమస్యలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త యాత్రను మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారా స్టేట్స్కాలనీలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి శుక్రవారం ప్రారంభించారు.
సహారా మొదటి గేటు వద్ద గాంధీ విగ్రహానికి సంఘం అధ్యక్షుడు శాంతకుమార్, కార్యదర్శి గంజి మురళి, సహాయ కార్యదర్శి నరహరి, సీనియర్ సభ్యుడు బడుగు శంకరయ్యతో కలిసి చెరుపల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పనులు లేక 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత, పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించాలని డిమాండ్ చేశారు. అధ్యయన యాత్ర డిసెంబర్ 10న నగరానికి చేరుకుంటుందని వెల్లడించారు. అదేరోజు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సెమినార్కు చేనేత రంగానికి చెందిన ప్రముఖులు, మేధావులను ఆహ్వానించి ఒక పాలసీని రూపొందించి, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు.