బాన్సువాడ టౌన్, జూలై 26 : సీఎం కేసీఆర్‌తోనే నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ మండలం, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 1,472 మంది డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు సుమారు రూ.13.83 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. మధ్యతరగతి, పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాల కోసం బాన్సువాడ నియోజకవర్గంలో వందలాది కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ హడ్కో నుంచి రుణం తీసుకొచ్చి లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో మొదటగా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి నుంచి 1,400 ఇండ్లు మంజూరు కాగా, బాన్సువాడ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 11 వేల ఇండ్లను సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరైనట్టు తెలిపారు.