హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. స్పెషల్ బస్సులు ఏర్పాటుచేశామని గొప్పగా ప్రకటించిన సంస్థ.. పెంచిన చార్జీల విషయాన్ని రహస్యంగా ఉంచింది. బస్సు ఎక్కిన తర్వాత పెరిగిన చార్జీలను చూసిన ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. సాధారణ చార్జీల కంటే స్పెషల్ బస్సుల్లో 25 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో బయటపెట్టే వరకు ఆర్టీసీ అధికారులు చెప్పకపోవడం గమనార్హం. 2 నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి నల్లగొండకు సాధారణ చార్జీ రూ.200 ఉంటే, రూ.250 వసూలు చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు ఊరెళ్తే అదనంగా రూ.200 పెట్టాల్సి వస్తుంది. ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా.. రోజువారీగా బస్సుల్లో అదనపు చార్జీలు లేవని, స్పెషల్ బస్సుల్లో ధరలు వర్తిస్తాయని తెలిపారు.
కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు ఏకపక్షం
హైదరాబాద్, అక్టోబర్9 (నమస్తే తెలంగాణ): కంప్లీషన్ సర్టిఫికెట్‌ను నీటిపారుదల శాఖ రద్దు చేయడం ఏకపక్ష నిర్ణయమని ఎల్అండ్టీ సంస్థ నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించిన కాంట్రాక్టు ఏజెన్సీ ఎల్అండ్టీకి సాగునీటిపారుదల శాఖ మార్చి 15 2021లో కంప్లీషన్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. బరాజ్‌లోని ఏడవబ్లాక్లో 3 పిల్లర్లు కుంగుబాటునకు గురవడంతో గతంలో జారీ చేసిన కంప్లీషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ సాగునీటిపారుదల శాఖ ఇటీవల ఎల్అండ్టీకి లేఖ రాసింది. బరాజ్ నిర్మాణం, ఒప్పందం నిబంధనలు డిపార్ట్మెంట్ ఉల్లంఘించినట్టు చూడాల్సి వస్తుందని హెచ్చరించింది. 2019లోనే బరాజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని నిర్ధారించిన తర్వాతనే నీటిపారుదల శాఖ అధికారులు 2021న కంపెనీకి సర్టిఫికెట్ జారీ చేశారని ఏజెన్సీ గుర్తుచేసింది.