Khammam | ఖమ్మం, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చి న ప్రతికూల ఫలితాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టిస్తున్నది. అధికారంలో ఉన్నా ఆశించిన స్థాయిలో విజయా లు రాకపోవడంతో హస్తం నేతలు కంగుతిన్నా రు. ఓటమికి సొంతపార్టీ నేతలే కారణమం టూ ఒకరిపైఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో ఖమ్మం కాంగ్రెస్ వర్గపోరు రచ్చకెక్కింది. గ్రామీణ ప్రజలు బీఆర్ఎస్, సీపీ ఎం మద్దతుదారులను గెలిపించడం కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటంలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఫలితాలు వెలువడిన రెండ్రోజుల తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, ఆమె భర్త దయానంద్ విజయ్‌కుమార్ సత్తుపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించి, పార్టీలో జరుగుతున్న పరిణామాలను బహిర్గతం చేశారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలితో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతలు, శ్రేణులపై చిందులుతొక్కారు. అధికారం బలంతో విర్రవీగిన కాంగ్రెస్ నేతలకు ప్రజలు గట్టిషాక్ ఇవ్వడంతోనే వర్గపోరు బయటకు వస్తున్నదనే వాదన వినిపిస్తున్నది.
కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులకు పోటీగా చాలాచోట్ల రెబల్స్ రంగంలోకి దిగారు. ఇదే ఓటమికి కారణమైందని సత్తుపల్లిలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసహనం వ్యక్తంచేశారు. పార్టీలో నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న నాయకులు కూడా ఎన్నికలను పట్టించుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్బాబుది సత్తుపల్లి నియోజకవర్గమే. ఈయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహితుడు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు నేరుగా పొంగులేటి సన్నిహితుడినే తప్పుబడుతుండటంతో ఖమ్మం రాజకీయాలు మారాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొంత మండలం కల్లూరులోనూ ఆ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. 23 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ ఐదు స్థానాలతోనే సరిపెట్టుకుంది. నేతల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే సత్తుపల్లిలో నష్టం జరిగిందని దయానంద్ తెలిపారు.
పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి సొంత పార్టీ నేత లే కారణమని హస్తం నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన పరిణామాలపై పినపాన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఎవరి పేరు ప్రసావించకుండానే నిప్పులుచెరిగారు. వెంకటేశ్వర్లుకు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ తూళ్లూరి బ్రహ్మయ్యకు మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు బ్రహ్మయ్యను ఉద్దేశించినవేనని వాదన వినిపిస్తున్నది. పాయం, బ్రహ్మయ్య ఇద్దరూ మంత్రి పొంగులేటి ముఖ్య అనుచరులు కావడం గమనార్హం. ఇద్దరి మధ్య పొసగడం లేదని ప్రచారం జరుగుతున్నది. సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీలో, పొంగులేటి సొంత మండలం కల్లూరులో బీఆర్ఎస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు పరస్పరం చేసుకుంటున్న ఫిర్యాదులపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో అనే చర్చ నడుస్తున్నది.