హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించి, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిలను ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియా చిట్‌చాట్ నిర్వహించిన మహేశ్వర్‌రెడ్డి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశా రు. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం చెప్తుంటే, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఎందుకు స్పం దించడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్, భట్టికి మధ్య విభేదాలున్నాయన్నారు. మంత్రివర్గ విస్తరణను రేవంత్‌రెడ్డే ఆపుతు న్నాడని పేర్కొన్నారు. మంత్రిమండలి రెండుగా చీలిపోయిందని చెప్పారు.
సీఎంను వ్యతిరేకించే మంత్రులు రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు రాహుల్‌గాంధీకి నివేదికలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్లు వస్తాయని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారనే అంతర్మథనంలో మంత్రులు ఉన్నారని వివరించారు. ఉద్యోగుల విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రివర్గంలో విభేదాలు వచ్చాయని పేర్కొన్నారు.
సమీక్షలను సీఎం తన నివాసంలో నిర్వహిస్తుండటంతో సీనియర్ మంత్రులు ఇబ్బంది పడుతున్నారని, కొన్ని శాఖల్లో సీఎం జోక్యం మంత్రులకు నచ్చడం లేదని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రికీ, రెవెన్యూ మంత్రికి మధ్య గ్యాప్ పెరిగిందని పేర్కొన్నారు. లోకల్‌బాడీ ఎన్నికల తర్వాత ఏ క్షణంలోనైనా ముఖ్యమంత్రి మార్పు జరుగవచ్చని మహేశ్వర్‌రెడ్డి జోస్యం చెప్పారు.
లోకల్‌బాడీ ఎన్నికల కోసం అటు కాంగ్రెస్ హైకమాండ్, ఇటు రాష్ట్ర నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. సీఎం మీద వస్తున్న అనేక ఆరోపణల ఫైల్ రాహుల్‌గాంధీ దగ్గర ఉన్నదని, వారి మధ్య గ్యాప్ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. అందుకే రాహుల్‌గాంధీ ఇటీవల హైదరాబాద్ వచ్చినా.. రేవంత్‌ను పలకరించలేదని చెప్పారు.