హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టుగా సాగుతున్నది ఏపీ సీఎం చంద్రబాబు ప్రగల్భాల ప్రహసనం. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో తనను మించిన వారు లేరన్నట్టు దూసుకుపోతున్నారు. ఈ నెలలో ఇప్పటికే పలుమార్లు డాంబికపు మాటలతో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైనా తాను మాత్రం తగ్గడం లేదు. దావోస్ పర్యటనలో ఉన్న బాబు నిన్నటికి నిన్న తాను తెచ్చిన ఐటీ పాలసీ వల్లే 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటూ గొప్పలు చెప్పారు.
తాజాగా మరో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన వల్లనే నేడు హైదరాబాద్‌కు అత్యధికంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జంటనగరాలైతే.. తాను సైబరాబాద్ సిటీని రూపొందించానని సెలవిచ్చారు. హైదరాబాద్‌ను మోస్ట్ లివబుల్ సిటీగా తాను మార్చడం వల్లే అత్యధికంగా జీసీసీలు తరలివస్తున్నాయని ఘనంగా చెప్పుకున్నారు. తన కృషి వల్లనే హైదరాబాద్‌లో అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పడిందని సెలవిచ్చారు. చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.