Chandrababu | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టండని అన్నాడట వెనకటికి ఒకడు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. తెలంగాణ ప్రజలకు అన్నం తినటం నేర్పింది తామేనని మరోసారి అనాలోచిత, అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం రాకమునుపు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటివి తినేవాళ్లు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో బియ్యంతో అన్నం వండుకుని తినడం రెండు రూపాయలకు కిలో బియ్యంతో మొదలైందని గుర్తు పెట్టుకోవాలి అని తెలంగాణ ప్రజలను చులకన చేసేలా మాట్లాడారు.
చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టు అధికారానికి దూరమైనా చంద్రబాబులో అహంకారం తగ్గలేదు. తెలంగాణపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతున్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు తెలంగాణలో వ్యవసాయం పండగెట్లయ్యిందో చెప్పాలి? రాష్ట్రంలో వరి రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతున్నది. దేశానికే అన్నం గిన్నెలా తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులు కూడా నేడు సన్నబియ్యమే తింటున్నారు. మరి చంద్రబాబు హయాంలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారు? తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేక బాబు పదే పదే విషం కక్కుతున్నారు. అడుగడుగునా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారు. 2009లో తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారు. మొదటి నుంచీ తెలంగాణ అంటే గిట్టని ఆయన ఇక్కడి ప్రజల సంస్కృతిపై దాడి చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు బాబును ఛీత్కరించినా ఆయనలో మార్పు రాలేదు. తెలంగాణకు అన్నం పెట్టింది టీడీపీ వారేనని తాజాగా చేసిన వ్యాఖ్య ఆయనకు తెలంగాణపై ఎంతటి ద్వేషముందో తెలియచేస్తున్నది. అలాగే హైదరాబాద్‌ను తానే కట్టానంటూ మరోసారి ప్రేలాపనలు చేశారు. గతంలో కూడా పలుమార్లు సంపద సృష్టించటం, ఉపాధి కల్పించటం, అభివృద్ధి చేయటం టీడీపీ వల్లే సాధ్యమని, తెలంగాణలో సంపద సృష్టించింది టీడీపీనే అని చెప్పారు. పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ కూడా తెలుగుదేశమని కామెంట్ చేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణంగా పలుమార్లు చంద్రబాబు చెప్పుకున్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిన విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఉస్మానియా దవాఖాన, ఉస్మానియా యూనివర్సిటీ, విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు అన్నీ నిజాం కాలం నాటికే ఉన్న సంగతి చరిత్ర చదివితే తెలుస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా నిజాం కాలం నాటిదే. బాబు హయాంలో కొత్తగా చేసిందేమీ లేదు. హైదరాబాదీయులకు పొద్దున నిద్రలేవటం తెలియదని, ఎన్టీఆర్ వచ్చాక వారంతా పొద్దున నిద్ర లేస్తున్నారని చంద్రబాబు గతంలో వెకిలిగా మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం తన వల్లే సాధ్యమైందని కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇక తండ్రికి తగ్గ వారసుడిగా లోకేశ్ కూడాతెలంగాణపై విషం చిమ్ముతున్నారు. బాబు అధికారంలోకి వచ్చాకే హైదరాబాద్ అభివృద్ధి సాధించిందని, అంతకుముందు అంతా రాళ్లూరప్పలుండేవని కామెంట్ చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా ఏపీలో తన ఉనికిని కాపాడుకోవాల్సింది పోయి పదేపదే తెలంగాణను చంద్రబాబు కించపరుస్తూ వస్తున్నారు.