Rains | హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. బుధ, గురువారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు, ఉరుములు, మెరుపులతో గంటకు 30నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వివరించింది. గడిచిన 24గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 6.10 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.