హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): గిరిజన యువతకు రావాల్సిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. నిధుల విడుదల కోసం 7న చలో గిరిజన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మనాయక్, శ్రీరాంనాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ నాయక్ ప్రకటన విడుదల చేశారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా 2019-2021 సంవత్సరాల్లో సబ్సీడీ రుణాల మంజూరుకు గిరిజన యువత నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
30 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించింది. వీరికి రుణాలు అందించడం కోసం రూ.219 కోట్ల చెక్కులను సిద్ధం చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపింది. కాంగ్రెస్ సైతం అధికారంలోకి రాగానే ఆ నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ రూ.219 కోట్లను విడుదల చేయలేదు. ఇదే సమయంలో రాజీవ్ యువ వికాసం పథకం కింద గిరిజనులు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. దీంతో గిరిజన యువతకు తీవ్ర నష్టం జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రూ.219 కోట్లను విడుదల చేయాలి. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’ అని గిరిజన నాయకులు హెచ్చరించారు.