కరీంనగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో పేరుకపోయిన దాదాపు రూ. 25 వేల కోట్లకుగా బిల్లులు సాధించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లను ఏకతాటికిపైకి తెచ్చింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఒకే గొడుగు కిందకు వచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా సమస్య వచ్చినా, ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోయినా, అధికారులు ఇబ్బందులు పెట్టినా.. ఆయా శాఖల పరిధిలో పనిచేసే కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పరిష్కరించుకునే వారు.
మిగిలిన శాఖల అసోసియేషన్లు కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం గానీ, మద్దతు ఇవ్వడం గానీ ఉండేదికాదు. కానీ రాష్ట్రంలో మొదటిసారిగా.. దాదాపు పదికిపైగా శాఖల పరిధిలో పనిచేసే కాంట్రాక్టర్లు అందరినీ ఒకే గొడుగు కిందకు తేవడానికి అసోసియేషన్ చేసిన ప్రయత్నం 99శాతం సక్సెస్ అయినట్టు అసోసియేషన్ నాయకులు చెప్తుతున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. అదే రోజు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే వీరి సమస్యలను రేవంత్ సర్కార్ పరిష్కరిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ మాత్రం కాంట్రాక్టర్లలో నెలకొన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శలొస్తున్నాయి. ఒకటి, రెండు కాదు అసోసియేషన్, అధికా రుల లెక్కల ప్రకారం.. వివిధ విభాగాలకు సంబంధించి సుమారు రూ.25 వేల కోట్ల పైచిలుకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో ఒక్క పంచాయతీరాజ్ విభాగం పరిధిలో పనిచేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.2,500 కోట్లపైగా బిల్లులు చెల్లించాల్సి ఉన్నది.
నీటిపారుదలశాఖ పరిధిలో పనిచేసిన కాంట్రాక్టర్లకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లు, ప్రజారోగ్యశాఖ పరిధిలో రూ.500 కోట్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ పరిధిలో రూ.2వేల కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో పనిచేసిన కాంట్రాక్టర్లకు రూ.750 కోట్లు, మిషన్ భగీరథ కింద రూ.2వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నదని సమాచారం. వీటితోపాటు రోడ్లు భవనాలశాఖ పరిధిలో రూ.3వేల కోట్లు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వివిధశాఖల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.7వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తున్నది. నిజానికి ఆయా శాఖల్లో గణాంకాలు తీస్తే.. మరో మూడు నుంచి నాలుగు వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.