పరకాల: రైతులను కష్టాలపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి రైతుల గోస తగులుతుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా రైతులను కలిసి వారి సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలను అడిగి తెలుసుకున్నారు. 20 రోజులు గడిచిన కాంటాలు పెట్టడంలేదని, ఏది చేయాలన్న డబ్బులు అడుగుతున్నారని, కనీసం తాగడానికి నీళ్లు కూడా మార్కెట్లో లేవని, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే కాంటాలు పెడుతున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యేకి తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు.
దీంతో రైతులతో కలిసి గుడెప్పాడ్ క్రాస్ వద్ద మక్కలు కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ..మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గన్నీ బ్యాగులు ఇవ్వకుండా, కాంటాలైన బస్తాలు తరలించకుండా కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యకం చేశారు. మక్కల కొనుగోలులో అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నట్టు తెలిపారు. రాహుల్‌గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ఈ నెల 6నాటికి నాలుగేండ్లు పూర్తవుతున్నా ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రుణమాఫీ కాలేదని, రైతు భరోసాను ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా మక్కలు కొనడం లేదని, దీంతో రైతులు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఈ నెల 6న హనుమకొండలో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని చల్లా ధర్మారెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.