హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు కొత్త ఎంప్లాయిస్ హెల్త్ సీమ్ (ఈహెచ్ఎస్)ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చించి రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డితోపాటు పలువురు జేఏసీ నాయకులు బుధవారం ఈ ముసాయిదాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న హెల్త్ సీమ్‌లోని లోటుపాట్లు, కొత్తగా ప్రతిపాదించిన హెల్త్ సీమ్‌తో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కలిగే ప్రయోజనాలను మంత్రికి వివరించారు. కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి భారం పడకుండా ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్యసేవలు అందుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ నిర్మల, కే రామకృష్ణ, డాక్టర్ కత్తి జనార్ధన్, దర్శన్‌గౌడ్, ఎస్ రాములు, డాక్టర్ వంశీకృష్ణ, దశరథ్, జయమ్మ, రమేశ్ పాక, రామ్ప్రతాప్సింగ్, గోవర్ధన్, పాండు, దీపక్ పాల్గొన్నారు.