నల్లగొండ, మార్చి 8: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. చట్టాలను తన చుట్టాలుగా మార్చుకొని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. నల్లగొండలోని తన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తూ దేశంలోనే గొప్ప మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, వారు యువతకు ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పోగాలం దాపురించి లాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడు తున్నదని హెచ్చరించారు.