భీమదేవరపల్లి, సెప్టెంబర్ 23 : ప్రజల దృష్టి మరల్చేందుకే మోదీ(Modi) ప్రభుత్వం జమిలి ఎన్నికలు (Jamili elections) అంటున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్రెడ్డి (Chada Venkat Reddy) ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ ప్రధాని మోదీ వైఖరి మారలేదని, రాష్ర్టాల హక్కులు కాలరాసేందుకే జమిలి ఎన్నికలు అంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఐదేళ్లపాటు ఉండాల్సిన ప్రభుత్వం ఒకవేళ రద్దయితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జమిలి ఎన్నికల వల్ల ప్రయోజనమేమిటో మోదీ చెప్పాలన్నారు. రాజ్యాంగానికి జమిలి ఎన్నికలు విరుద్ధమని, వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువు శిఖం, నాలా వంటి ప్రదేశాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయడం మంచిదేనని, కానీ పేదల గుడిసెలపై జులుం చేయడం సరైందికాదన్నారు.
నిరాశ్రయులుగా మారిన పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఎల్కతుర్తి నుంచి సిద్దిపేటకు నేషనల్ హైవే నిర్మిస్తున్నారని ఆరోపించారు. వేసిన రోడ్డు వేసినట్టే పోతున్నదని, దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న ఈ రోడ్డు నాణ్యతా ప్రమాణాలపై సీపీఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చాడా పేర్కొన్నారు.