హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్‌బీ కాలనీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఆయుధంలాంటిదని, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఓటు వేయడాన్ని గర్వంగా భావించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్బోధించారు. నగరంలోని జేఎన్టీయూలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు ప్రాధాన్యతను వివరించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి బెదిరించారని, ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులకు మొదటిసారి హోం ఓటింగ్ నిర్వహించారని, ఈ ఎన్నికలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచాయని అన్నారు. నోటాకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ.. అబ్రహాంలింకన్ అన్న బుల్లెట్ కన్నా ఓటు బలమైనది అన్న మాటను గుర్తు చేశారు. ప్రస్తుతం ఓటు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పెరగగా.. హైదరాబాద్ వంటి పట్టణాల్లో తగ్గిందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు మరింత కృషి చేస్తామని చెప్పారు.
తెలంగాణలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్టు తెలిపారు. గత ఏడాది కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారు 9,99,667 ఓటర్లు నమోదైనట్టు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7.50 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. అర్హులైన వారంతా ఆన్లైన్లో, బీఎల్ఓల ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని వికాస్‌రాజ్ కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఢిల్లీ నుంచి సందేశం ఇచ్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అయా జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఆయా పోటీల్లో విజేతలైన పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను గవర్నర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీఈవో లోకేశ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , జోనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, అభిలాష అభినవ్, వెంకటేశ్ దొత్రే, రవి కిరణ్, పంకజ, తదితరులు పాల్గొన్నారు.