హైదరాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో రైతుల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకొంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సాగుకు ప్రోత్సాహం ఇవ్వడం వల్లే తెలంగాణలో పంటల ఉత్పత్తి విపరీతంగా పెరిగిందని, రైతులు ఆర్థికంగా స్థిరపడుతున్నారని పేర్కొన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహిస్తున్న వైగా- 2023 అంతర్జాతీయ సదస్సుకు మంగళవారం హాజరైన మంత్రి మాట్లాడారు. వ్యవసాయమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, అనేక పథకాల వల్ల తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి సాగయ్యే పంటల ఆధారంగా దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాల్సిన ఆవశ్యకత ఉన్నదని అభిప్రాయపడ్డారు. కేంద్ర సర్కారు వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని, అందువల్లే చిన్న చిన్న దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ అదనపు సంచాలకుడు సుధీర్, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.