రైతులను ఏడ్పించడం మానుకోవాలి: మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ: కేంద్రం రైతులను ఏడ్పించడం మానుకోవాలని, వ్యవసాయ చట్టాల అమలును తక్షణమే నిలిపివేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈనెల 29న రైతులతో జరుగనున్న చర్చలు ఫలప్రదం అయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. కనీస మద్దతు ధర విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పప్పు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఆయిల్‌పామ్ ఉత్పత్తులపై ప్రోత్సాహకాలను పెంచాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాది రైతులకు అధిక నష్టం
ఉత్తరాది రాష్ట్రాల రైతులకు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల తక్షణమే నష్టం ఏర్పడుతుందని, అందుకే అక్కడి రైతులు ఆందోళనల్లో ఎక్కువగా పాల్గొంటున్నారని చెప్పారు. ఈనేపథ్యంలోనే ఉత్తరాది రైతులు ఎక్కువగా మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఆ వివాదాస్పద చట్టాల రద్దుకు ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే అక్కడి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దగా చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. మన రాష్ట్రంలో సన్నరకం హెచ్ఎంటీ రకానికి క్వింటాకు రూ.2400 ధర వస్తుంటే అక్కడ రూ.1200 నుంచి రూ.1500లకే కొంటున్నారని అన్నారు.
మొండికి పోతున్న మోదీ
కొత్త చట్టాల విషయంలో రాష్ట్రాలు, రైతులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ చట్టసవరణ బిల్లు వల్ల తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. వ్వవసాయ చట్టాలపై ప్రధాని మోదీ మొండిగా వ్యవహరించడం తగదని, రైతుల పక్షాన ఆలోచించాలని కోరారు.
ఇక నల్లగొండ జిల్లాలో గతంలో దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యనాయక్ను నక్సల్స్ హత్య చేస్తే ఆయన భార్య భారతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న చరిత్ర జిల్లాకు ఉందన్నారు. అదే సంప్రదాయాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కూడా పాటించి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.