హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : పంటల మద్దతు ధర విషయంలో కేంద్రం ప్రకటనలకే పరిమితమైందని, కొనుగోళ్లలో పరిమితులు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నదని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న శనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, పెసర తదితర పంటలపై ఉన్న 25శాతం పరిమితిని ఎత్తివేయా లని తుమ్మల ఆదివారం మరోసారి లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం, ఆ హామీ అమలుల్లో విఫలమైందని విమర్శించారు. తెలంగాణ లో అధికంగా ఉత్పత్తి అవుతున్న వరి సేకరణను ఏటా తగ్గించడం, దొడ్డు బి య్యం సేకరణ విషయంలోనూ మాట మార్చడంతో రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని తుమ్మల కోరారు.