కేంద్రం తీరుపై సీపీఐ నేత చాడ ఫైర్
కరీంనగర్ తెలంగాణ చౌక్, మార్చి 27: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులపాల్జేస్తున్నదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ర్టాల హక్కులను హరిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. కేంద్రం తీరును నిరసిస్తూ బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో ఏప్రిల్ 6న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.