PM Modi | భారీ వర్షాలకు నదులు ఉప్పొంగితే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. నదుల తీరం వెంట ఉండే ప్రజల జీవితాలు తల్లకిందులవుతుంటాయి. తెలంగాణలో అయినా హిమాచల్ ప్రదేశ్‌లో అయినా నదులవల్ల నష్టం ఒకటే. బాధితుల కష్టాలు ఒకేరకంగా ఉంటాయి. కానీ, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు నిండు మనసుతో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రాష్ర్టాల ప్రజల కడగండ్లు కనిపించటం లేదు. ముఖ్యంగా బల్లలు చరిచి శపథం చేసి తెలంగాణపై పగబట్టిన నరేంద్రమోదీ సర్కారుకు గోదావరి వరద బాధితుల కన్నీళ్లు కనిపించనేలేదు. సోమవారం ఐదు రాష్ర్టాలకు రూ.1,810.16 కోట్ల వరద సాయం విడుదల చేసిన కేంద్రం, తెలంగాణకు చిల్లి గవ్వకూడా ఇవ్వలేదు. ఈ నిధుల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకే ఏకంగా సగం కేటాయించి తమకు ప్రజల కన్నీళ్లకంటే వాళ్ల ఓట్లే ముఖ్యమని బీజేపీ సర్కారు చెప్పకనే చెప్పింది.
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): వరద సాయంలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి తీవ్ర అన్యాయం చేసింది. గడిచిన నాలుగేండ్ల్లుగా జాతీయ విపత్తు సహాయ నిధి కింద రాష్ర్టానికి నయా పైసా ఇవ్వలేదు. తాజాగా గత ఏడాది వరదలకు సంబంధించి కూడా రాష్ర్టానికి మొండి చేయి చూపింది. అదే సమయంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటక రాష్ర్టానికి మాత్రం నిధుల వరదను పారించింది. జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఐదు రాష్ర్టాలకు రూ.1,816.16 కోట్ల అదనపు సహాయ నిధిని కేంద్రం విడుదల చేసింది. ఇందులో అస్సాంకు రూ.520.46 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.239.31 కోట్లు, కర్ణాటకకు రూ.941.04 కోట్లు, మేఘాలయకు రూ.47.32 కోట్లు, నాగాలాండ్‌కు రూ.68.02 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
అత్యధిక వరదలు వచ్చిన రాష్ర్టాలకు నామ మాత్రపు సాయం విడుదల చేసిన కేంద్రం, తక్కువ వరదలు వచ్చిన రాష్ర్టాలకు అధిక నిధులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌లో కనీవిని ఎరగని రీతిలో రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తాయి. ఇలాంటి రాష్ర్టానికి కేంద్రం విడుదల చేసిన వరద సాయం కేవలం రూ.239 కోట్లు. అదే తక్కువ వరద వచ్చిన కర్ణాటక రాష్ర్టానికి మాత్రం అత్యధికంగా రూ.941 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందుకు కారణం ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనుండటమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క వరద సాయంలోనే కాదు.. ఇతర నిధుల విడుదలలోనూ, ప్రభుత్వానికి సాయం చేయడంలోనూ ప్రత్యేక ప్రేమను చూపిస్తున్నది. ఇదంతా కూడా ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ చేస్తున్న చిల్లర రాజకీయాలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వరదలు వస్తున్నాయి.. పోతున్నాయి కానీ రాష్ర్టానికి కేంద్ర సాయం మాత్రం ఎండమావిగానే మారింది. గడిచిన నాలుగేండ్ల్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఒక్క రూపాయి కూడా వరద సాయం ఇవ్వలేదు. ఈ విషయాన్ని గత ఏడాది పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానం ద్వారా ఒప్పుకొన్నారు. 2019, 2020, 2021లో రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తాయి. మరీ ముఖ్యంగా 2020 అక్టోబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు, మొత్తం సాయంగా రూ.5 వేల కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు అతీగతీ లేదు. వరదల సయమంలోనే నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చేతికి ఎముక లేనట్టుగా హామీలిచ్చింది. తాము గెలిస్తే వరదల్లో బైక్ పోగొట్టుకొన్నవారికి బైక్, కారు పోగొట్టుకొన్నవారికి కారు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రం నుంచి కనీసం వరద సాయం కూడా తీసుకురాలేక ముఖం చాటేశారు.
గత ఏడాది జూలైలో భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి భద్రాచలం పట్టణం పూర్తిగా మునిగిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. ప్రాథమికంగా రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనావేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించింది. ఇంతవరకూ మోదీ సర్కారు ఒక్క పైసా సాయం చేయలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 25 రాష్ర్టాలకు కేంద్రం వరద సాయం కింద ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.15,770 కోట్లు విడుదల చేసింది. ఎన్డీఆర్ఎఫ్ కింద మరో రూ.502.744 కోట్లు కేటాయించింది. సోమవారం నిధులు విడుదల చేసిన రాష్ర్టాల్లో వరదలు సంభవించినప్పుడు కేంద్రం ఆగమేఘాల మీద అధికారుల బృందాన్ని పంపి నష్టాన్ని అంచనావేయించింది. తెలంగాణలో గోదావరి వరదలవైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఏటా అన్ని రాష్ర్టాలకు ఇచ్చినట్టుగా వచ్చే నిధులు తప్ప తెలంగాణకు పైసా అదనపు సాయం అందలేదు.
