హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగాన్ని నీరుగార్చి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల పొలాలను కార్పొరేటు సంస్థలకు అప్పగించి, అదే పొలాల్లో రైతులను కూలీలుగా మార్చాలని చూస్తున్నదని, విద్యుత్తు సంస్కరణలు, రైతు చట్టాలు అందులో భాగమేనని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ధాన్యా న్ని కొనాలని కోరితే ప్రధాని నరేంద్రమోదీకి మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. కేంద్రానికి బాధ్యతను గుర్తు చేసేందుకే ఢిల్లీలో ధర్నా చేశామని, త్వరలో దేశవ్యాప్తంగా మహా సంగ్రామం మొదలవుతుందని తెలిపారు.
కేంద్రంలో దిక్కుమాలిన ప్రభు త్వం అధికారంలో ఉండటం దేశ రైతుల దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరకేంగా దేశ రాజధానిలో 13 నెలలపాటు ఉద్యమించిన రైతులను బీజేపీ నేతలు అనేక రకాలుగా తూలనాడారని, ఖలిస్థాన్ ఉగ్రవాదులంటూ అవమానపర్చారని గుర్తు చేశారు. చివరకు ప్రధాన మంత్రే క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వాపసు తీసుకోవడాన్ని మనం చూశామన్నారు. ‘గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని, తద్వారా రైతులకు చౌకగా కూలీలు దొరుకుతారని రాష్ట్రం తరఫున ఎన్నోసార్లు చెప్పాం. ఈ అంశాన్ని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టుకొన్నా.. ఆచరణలో ఏమీ చేయలేదు. పైగా ఎరువుల ధరలు పెంచారు. భూగర్భజలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల బావులకాడ కరెంటు మీటర్లు పెట్టాలంటూ దిక్కుమాలిన, పనికిమాలిన విద్యుత్తు సంస్కరణలు తెచ్చిండ్రు. వీటిని ఎఫ్ఆర్బీఎంలో 0.5% రుణాలకు ముడిపెట్టి రాష్ర్టాలను నష్టాలకు గురిచేస్తున్నారు.
ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని బలహీనపర్చేందుకు, రైతులను నిరుత్సాహపర్చేందుకు జరుగుతున్న కుట్రలో భాగామే’ అని తెలిపారు. రైతు చట్టాల పేరిట మార్కెట్లు లేకుండా చేయాలని చూశారని, తర్వాత తోకముడిచారని, ఎమ్మెస్పీ కోసం చట్టం తెస్తామన్న హామీని మరిచారని విమర్శించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ కేంద్రానికి అవసరమైన చట్టాలను మాత్రమే ఆమోదించుకొన్నారని, రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. రైతుల కోసం దేశంలో మహా సంగ్రామాన్ని మొదలుపెడతామని ఢిల్లీలో తనతోపాటు ధర్నాలో పాల్గొన్న రైతు సంఘాల నాయకుడు రాకేశ్ టికాయిత్ చెప్పారని.. అది కచ్చితంగా జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అది నోరా.. మోరా..?
ఇంత పెద్ద దేశాన్ని పాలించే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబించాల్సిన పద్ధతి ఇదేనా? అని సీఎం కేసీఆర్ నిలదీశారు. మోరీల లాంటి నోళ్లతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నామని తెలిసి కూడా కేంద్రం ఆత్మవంచన చేసుకొంటున్నదని మండిపడ్డారు. ‘బఫర్ స్టాక్ మెయింటెయిన్ చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అందుకే ఢిల్లీలో ధర్నా చేసి ప్రజల ముందు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టినం. ఢిల్లీ ధర్నాలో నా ఉపన్యాసంలో కూడా స్పష్టంగా అడిగా. తెలంగాణాకా ధాన్య్ ఖరీద్నే కేలియే ఇత్నా బడా కేంద్ర సర్కార్కే పాస్ ధన్ నహీహై? యా.. ప్రధాన్ మంత్రీజీకా మన్ నహీహై? (తెలంగాణ ధాన్యాన్ని కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేదా? లేక ప్రధాన మంత్రికి మనసు లేదా?)’ అని ప్రశ్నించినట్టు తెలిపారు. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన ఘరానా మోసగాళ్లంతా విదేశాల్లో సురక్షితంగా ఉన్నారని, వారిని సీబీఐ అరెస్టు చేయకుండా కేంద్రంలోని పెద్దలు కాపాడుతున్నారని మండిపడ్డారు. ఆ పాపాల పుట్టను త్వరలో బయటపెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పీయూష్ గోయల్‌కు అంత గర్వమా?
తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం చాలా చిక్కిరిబిక్కిరిగా వితండవాదం చేస్తున్నదని, కేంద్రం తీరు తలాతోక లేనివిధంగా ఉన్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై స్వయంగా తానే ఢిల్లీకి వెళ్లి మాట్లాడినా కేంద్రం మొండికేస్తున్నదని దుయ్యబట్టారు. ‘ధాన్యం కొనాలని చెబితే.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చాలా అవమానకరంగా మాట్లాడారు. నాణ్యమైన వడ్లను పండించి దేశానికి బియ్యం ఇస్తున్న తెలంగాణ రైతన్నలకు నూకలు తినడం నేర్పమన్నారట. ఆ మంత్రికి ఎంత గర్వం? ఆయనకు తెలివి, జ్ఞానం, మెదడు ఉన్నదో లేదో తెలియడంలేదు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాళ్ల (కేంద్ర ప్రభుత్వ) సోమరితనం, పరిపాలన చేయలేని అవివేకం అందరికీ ఉందనుకుంటారు. ఎందుకంటే.. తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదు. వాళ్లకు పరిపాలన చేతకాదు. అందుకే వాళ్లు సాధించలేని లక్ష్యాలను తెలంగాణ సాధిస్తే.. వాటిని జీర్ణించుకోలేక క్యా చమత్కార్ అని మాట్లాడుతున్నరు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. ఒక్క యాసంగిలో 36 లక్షల వరిసాగైంది. దేశంలోని మిగిలిన రాష్ర్టాల్లో మనదానిలో సగం కూడా సాగు కాలేదు. అది వాళ్లకు సాధ్యం కాలేదు. ఇదే తెలంగాణ చమత్కార్.’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు చురకలు అంటించారు. ‘కేంద్రంలోని బీజేపీ నాయకులు తమ అసమర్థతను ఇతరులపై నెడుతున్నారు. దద్దమ్మలం.. మతం పేరుమీద గెలిచినం అని చెప్పొచ్చు కదా? ధాన్యం విషయంలో ఏ రాష్ర్టానికి లేని సమస్య తెలంగాణకే ఎందుకు వస్తున్నదని అని అంటున్నరు. ఎందుకంటే.. ఏ రాష్ట్రం వేయనంత పంట మేం వేసినం. తీసుకోవడం మీకు చేతకాక ప్రతిసారి ఒక మెలిక పెట్టి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న బాధ్యతను విస్మరించి మాట్లాడుతున్నరు. గత మూడు నాలుగు ఏండ్లుగా అనేక వేల టన్నుల బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసి కూడా మేం ఎగుమతి చేయలేం అని కేంద్రం అబద్ధాలు చెప్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ధాన్యం కొనుగోళ్లలో బ్రహ్మపదార్థమేమీ లేదు. విషయం చాలా సింపుల్. ఉష్ణోగ్రతలు పెరుగుతై కాబట్టి యాసంగి వడ్లలో నూకల శాతం ఎక్కువైతది. ఏప్రిల్, మేలో 35 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ సమయంలో బ్రోకెన్‌రైస్ ఎక్కువ వస్తది. అసలు విషయం అదే. మామూలుగా వర్షకాలం వడ్లకు అయితే వంద కిలోలు పడితే 67 కిలోల బియ్యం వస్తాయి. యాసంగి ధాన్యానికి 34 నుంచి 35 కిలోల బియ్యం మాత్రమే వస్తాయి. ఇదీ తేడా. ఆ డబ్బును కేంద్రం భరించాలి. ఎందుకంటే దేశ ఆహార భద్రత బాధ్యత రాజ్యాంగబద్ధంగా కేంద్రానికి అప్పగించబడింది’ అని వివరించారు.