గజ్వేల్, మే 27 : తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై లారీకి రూ.50 వేల లెక్కన దోచుకుంటున్నారని విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ఎదుట చేపట్టిన రైతుదీక్షలో పాల్గొన్న అనంతరం మార్కెట్లో తడిసిన ధాన్యం బస్తాలు, రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.40 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించేలా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. ఇప్పుడు అదే తరహాలో ధాన్యం పండితే కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలుపై రేవంత్‌రెడ్డి సర్కార్ విఫలమైతే బీజేపీ నాయకులు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నరని మండిపడ్డారు.
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం ఈ సర్కార్‌కు చేతకావడం లేదని దుయ్యబట్టారు. సాగుకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేని ప్రభుత్వానికి తెలంగాణను పాలించే అర్హత లేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే రైతుబంధు పెంచుతామని దొంగ హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనియ్యకుండా రైతులే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడం లేదు, మరో నెల రోజుల్లో రైతులు కోరుకునే ఎరువులను సరఫరా చేయలేని ఇలాంటి రాక్షస ప్రభుత్వం మనకు అవసరమా? అని రైతులను ప్రశ్నించారు. ఎన్నికలోస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదని, రేవంత్‌రెడ్డి తన డిపాజిట్ కోసం ఆలోచించే పరిస్థితి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గజ్వేల్ పరిధిలో ఇప్పటి వరకు రైతుల నుంచి కొనుగోలు చేసింది 30శాతం కాగా మరో 70శాతం ధాన్యం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నదని తెలిపారు. రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు, రాశులు తడిసి ముద్దయ్యాయని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.