హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ప్రజలు. కొన్నేళ్లుగా రాష్ర్టానికి అన్యాయం జరుగుతూ ఉన్నా.. కేంద్ర మంత్రుల స్థానంలో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలెవరూ నోరు మెదపడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీలను కూడా కేంద్రం పెడచెవిన పెట్టింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కొత్త రైల్వే మార్గాల నిర్మాణం, మూడో రైల్వే లైన్ల నిర్మాణాలతోపాటు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి తదితర ప్రాజెక్టుల అభివృద్ధిపై కేంద్రం పట్టించుకోవడం లేదు. కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నా.. బీజేపీ సర్కార్ కనీసం స్పందించడం లేదు. ప్రతి ఏడాది కూడా రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం విడుదల చేస్తున్న నిధులు కూడా ఆంధ్రాతో పోల్చితో చాలా తక్కువగానే కేటాయిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. ఇలాంటి వివక్ష కొనసాగుతుండడంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యంపై రైల్వే మజ్దూర్ సంఘం నాయకులు మండిపడుతున్నారు.
అంతమంది ఎంపీలుండీ ఏం లాభం ?
తెలంగాణలో పూర్తి కావాల్సిన రైల్వే ప్రాజెక్టుల పనుల కొనసాగింపుపై కేంద్రం అడుగడుగునా వివక్ష చూపుతుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 16 మంది ఎంపీలు ఉండి ఏం లాభమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిని కాంక్షించడం లేదని, తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అందుకు ఏపీకి ఇప్పటికే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించింది. ఆ ప్యాకేజీతో ఏపీలో నిడదవోలు- దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ నిర్మించబోతున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.9,889 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఏపీలో ఇండస్ట్రియల్ కారిడార్లో మొత్తం 198 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఏపీలోని పోర్టులు, పారిశ్రామిక వాడలు, ఎగుమతులు పెరుగడానికి అవకాశం ఉంటుంది. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులను అభివృద్ధి చేయకుండా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ప్రశ్నలకు మాత్రం కేంద్రం నుంచి, దక్షిణ మధ్య రైల్వే అధికారుల నుంచి గానీ ఎలాంటి సమాధానాలు మాత్రం రావడం లేదు.