PM Kisan | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పీఎం కిసాన్ లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వింత వాదన చేస్తున్నది. పథకం అర్హత కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టి.. ఇప్పుడు ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోతున్నదని, రైతులకు పీఎం కిసాన్ నిధులు అందడం లేదంటూ ‘పీఎం కిసాన్ పైసలు పడ్తలేవు’ శీర్షికతో నమస్తే తెలంగాణ మంగళవారం కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ వివరణ ఇచ్చింది. ఇందులో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయిందని పరోక్షంగా ఒప్పుకొన్నది. అంటే నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం నిజమేనని చెప్పకనే చెప్పింది. అయితే ఈ తగ్గుదలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ వింత వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ర్టాలు పంపిన జాబితా ప్రకారమే తాము నిధులు అందజేశామని తప్పించుకొనే ప్రయత్నం చేసింది.
వాస్తవానికి పీఎం కిసాన్ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్రం కఠిన నిబంధనలను రూపొందించింది. కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదని, రూ.10 వేలకన్నా ఎక్కువ పెన్షన్ తీసుకోరాదని, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు ఉండరాదని కండిషన్లు పెట్టింది. దీని ప్రకారం అర్హుల జాబితాను పంపించాలని రాష్ర్టాలను ఆదేశించింది. ఆ నిబంధనల ప్రకారమే అర్హుల జాబితాలను రాష్ర్టాలు పంపించాయి. ఇప్పుడేమో తమకే పాపం తెలియదన్నట్టు మాట్లాడుతున్నది. పీఎం కిసాన్ పథకాన్నే పూర్తి లోపభూయిష్టంగా తయారుచేసి ఇప్పుడు ఆ నిందను రాష్ర్టాలపై నెట్టాలని చూస్తున్నది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా గుంటెడు భూమి ఉన్నా సరే రైతులందరికీ రైతుబంధును అందిస్తున్నది. కేంద్రం కూడా రైతులపై ప్రేమ ఉంటే పీఎం కిసాన్‌ను రైతుబంధు మాదిరిగా అమలు చేయొచ్చు కదా? అని తెలంగాణ రైతులు ప్రశ్నిస్తున్నారు.