హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఆగస్టులోపు అదనపు తరగతి గదులు.. డిసెంబర్‌లోపు టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ర్టాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 1,823 బాలికల టాయిలెట్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 342 మాత్రమే పూర్తికాగా, 630 టాయిలెట్ల కొరత సమస్య ఉంది. ఈ 630 టాయిలెట్లను 2026-27 విద్యాసంవత్సరంలో పూర్తిచేయాలని కేంద్రం గడువుగా నిర్దేశించింది.
27 అదనపు తరగతి గదుల నిర్మాణం పెండింగ్‌లో ఉండగా, వీటిని ఆగస్టులోపు పూర్తిచేయాలని కేంద్రం సూచించింది. సమగ్రశిక్షా ప్రాజెక్ట్ అప్రూవల్బోర్డు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఢిల్లీ నుంచి కేంద్ర విద్యాశాఖ అధికారులు వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ నుంచి విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ హాజరయ్యారు. వచ్చే విద్యాసంవత్సరం(2026-27)లో మొత్తం రూ. 1,640.85కోట్లు ఖర్చుచేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.
కేంద్రం వాటాగా రూ. 984.51, రాష్ట్రవాటాగా రూ. 656.34 స్పిల్ ఓవర్‌గా రూ. 135.61కోట్ల చొప్పున ఖర్చుచేసేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అంధుల పాఠశాలలు, విద్యార్థుల నమోదు విషయాల్లో రాష్ట్రం సమర్పించిన వివరాలు సమగ్రంగా లేకపోవడంతో ఆయా వివరాలు మళ్లీ సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మంలో అంధుల పాఠశాలలున్నాయి. ఇవి ఇంతవరకు వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తుండగా, వీటిని పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి చేర్చనున్నారు.