కొంపెల్లి/మునుగోడు : తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, నిధుల కేటాయింపులో తీవ్రమైన వివక్ష కనబరుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మునుగోడు మండలం కొంపల్లిలో ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో గెలిస్తే ఆ నియోజకవర్గాలకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని, ఆ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏం కేటాయించారని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను నీరుగార్చారని, తెలంగాణలో మాత్రం కులవృత్తులకు పూర్వ వైభవం లభించిందని అన్నారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే అండగా ఉంటున్నారని మంత్రి తెలిపారు. తాగునీటి కోసం గోసపడిన మునుగోడు ప్రజలు ఇప్పుడు స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీటిని తాగుతున్నారని ఇదంతా సీఎం కేసీఆర్ చలువేనని అన్నారు.
టీఆర్ఎస్ లో చేరికలు..
కొంపెల్లి గౌడ సంఘం సొసైటీ సభ్యులు సుమారు వంద మంది మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ నాయకుడు పల్లె రవి కుమార్ గౌడ్, సీపీఎం, సీపీఐ, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.