హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.34,149 కోట్లు..! కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులివి. ఆర్థిక సంఘం ఆదేశించినా.. నీతి ఆయోగ్ చెప్పినా.. విభజనచట్టం స్పష్టంగా పేర్కొన్నా.. తెలంగాణ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వని కేంద్రం.. రాష్ట్రం సొంతంగా నిధులు సేకరించుకునేందుకూ అనుమతించడం లేదు. మొత్తంగా తెలంగాణను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని స్పష్టమవుతున్నది.
రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి అభ్యర్థించినా, పలుమార్లు లేఖలు రాసినా కేంద్రం నుంచి కనీస స్పందన లేదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రతి సందర్భంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రిని, ఇతర మంత్రులను నిధుల విడుదలపై అడుగుతూనే ఉన్నారు. అయినా కేంద్రం ఉలుకూపలుకూ లేదు. సాధారణంగా ఆర్థిక సంఘాలు ఇచ్చే సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అంగీకరించి.. ఆ మేరకు నిధులను విడుదల చేస్తుంటుంది. కానీ.. ఈ సంప్రదాయానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గండికొట్టింది. మోదీ ప్రభు త్వం స్థాపించిన నీతిఆయోగ్ చెప్పిన మాటలను, చేసిన సిఫారసులను సైతం కేంద్రం పెడచెవిన పెట్టింది. మరోవైపు.. బడ్జెటేతర రుణాలను వంకగా చూపి రాష్ట్రం నిధులు సమీకరించుకోకుండా కేంద్రం అడ్డుకుంటున్నది. ‘అమ్మ పెట్టదు..’ చందంగా తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.34 వేల కోట్లను కేంద్రం ఇవ్వకపోగా.. రాష్ట్రం రుణాలు తెచ్చుకోకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నది.
ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని, అందుకే తెలంగాణ ప్రగతి పరుగులకు మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అందనంత ఎత్తులో తెలంగాణ ఉండటం, మరీ ముఖ్యంగా అనేక అంశాల్లో గుజరాత్‌ను దాటేయడం జీర్ణించుకోలేకపోతున్నదని వారంటున్నారు. తాను కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులను ఆపడంతోపాటు, రాష్ట్రం రుణాలు తీసుకోకుండా అడ్డుకుంటున్నదని ఆర్థిక నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.