హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై కక్ష సాధించడానికి అన్ని అవకాశాలనూ వాడుకొంటున్న మోదీ సర్కారు.. పార్లమెంట్లో చేసిన చట్టంలోని హామీలను సైతం అమలుచేయకుండా రెండు రాష్ర్టాల మధ్య గిల్లికజ్జాలు పెడుతూ వేడుక చూస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంట్లో ఆమోదం పొందిన పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సమస్యలను పరిష్కంచకుండా వివక్ష ప్రదర్శిస్తున్నది. దీంతో రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లయినా విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారాయి. సమస్యలకు పరిష్కారం చూపడం చేతకాని ప్రధాని మోదీ, రామగుండం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మాత్రం భుజాలు ఎగరేసుకొంటూ వస్తున్నారు. తెలంగాణకు నవరత్న కంపెనీ ఇచ్చామనేంతగా స్థానిక బీజేపీ నాయకులు గొప్పలకు పోతున్నారు. మూతపడిన ఫ్యాక్టరీని తెరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం 11శాతం పెట్టుబడి పెట్టి, 1 టీఎంసీ నీళ్లు కేటాయించి, పైపులైన్లు వేసి, విద్యుత్తు సరఫరా కేటాయించి, మౌలిక సౌకర్యాలకు రూ.199 కోట్లు ఖర్చుచేస్తే తప్ప.. కేంద్ర ప్రభుత్వం కదల్లేదు.
లేఖలు, వినతి పత్రాలు బుట్టదాఖలు
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నుంచి అమల్లోకి ఉనికిలోకి వచ్చింది. 2014 మార్చి నెలలోనే పునర్వ్యవస్థీకరణ చట్టానికి పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి నేటివరకు ఆ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహిస్తూ లేఖలు రాస్తున్నది. విభజన సమస్యలపై ఇప్పటివరకు 26 సార్లు సమావేశాలు నిర్వహించినా పరిష్కారం చూపలేదు. విభజన సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీ, గత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కేంద్రంలో చలనం లేదు.
రాజకీయ లబ్ధికే పరిష్కారం వాయిదా
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్ తూర్పారబట్టడంతోనే కేంద్రం వివక్ష ప్రదర్శిస్తూ పరిస్థితిని జటిలం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మధ్య నిత్యం పంచాయితీ ఉంటే, దాన్ని రాజకీయంగా వాడుకొని రాష్ట్రంలో బలపడే వ్యూహంలో ఇదీ భాగమేనని పేర్కొంటున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట, అనుకూల ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాలకు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్న కేంద్రం.. రాజకీయంగా పెద్దగా ఉనికి లేని చోట మాత్రం సమస్యను మరింత తీవ్రం చేస్తున్నది. ఆ రాష్ర్టాల్లో తాము అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయంటూ స్థానిక బీజేపీ నేతలు ప్రకటించడం సైతం కుట్ర కోణాన్ని బయటపెడుతున్నది. ఉత్తరాది పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ, దక్షిణాదిపై ఎప్పుడూ సవతి ప్రేమనే ప్రదర్శించిందని, కేంద్రం వద్ద ఉన్న నిధులు, అధికారాలతో విభజన సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవీ కేంద్రం నిర్లక్ష్యానికి చిరునామాలు
కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరుచేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 150 ఎకరాల భూమిని కేటాయించినట్టుగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌కు తరలించారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేశారు. కమిటీలు, అధ్యయనాల తర్వాత పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్రప్రభుత్వం తేల్చింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్)ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీని రద్దుచేశారు. దీని ద్వారా లక్షలాది మందికి కొత్తగా లభించే ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలను పరిష్కరించలేదు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతో ఇంతవరకు తేల్చలేదు. సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకొన్న తరువాత కూడా వాటా తేల్చలేదు. కేసు ఉపసంహరించుకోగానే వాటా తేలుస్తామని గతంలో కేంద్రం నమ్మబలికింది. కేసు ఉపసంహరించుకొని ఏడాది దాటినా వాటా తేల్చడం లేదు.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఎనిమిదేండ్లయినా అతీగతీ లేదు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు విన్నవించినా కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ యూనివర్సిటీకి ములుగు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ కేంద్రం పట్టించుకోవటం లేదు.
అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాతామన్న హామీ అమలుకాలేదు. తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుతామన్నారు. రాష్ట్రం ప్రశ్నిస్తే, ఇప్పుడే కాదంటూ 2026 తర్వాతకు దాటవేశారు.
తెలుగు అకాడమీ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తుదితీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు రావటంతోనే నగదు, సిబ్బంది పంపిణీకి మార్గం సుగమమైంది. తెలుగు అకాడమీలో రూ.213కోట్లు ఉండగా 48ః52 శాతం నిష్పత్తిలో పంచుకోవాలని సూచించింది. సిబ్బందిని తెలంగాణకు 21 మంది, ఏపీకి 32మందిని కేటాయించారు. తెలుగు అకాడమీ విక్రయ కేంద్రాలు తెలంగాణకు మూడు, ఏపీకి ఐదు వెళ్లాయి.
షెడ్యూల్ 9లో 91 సంస్థలను విభజించాల్సి ఉన్నది. ఈ సంస్థల విభజనపై షీలాబిడే కమిటీ సిఫారసు చేసింది. ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాన్ని హెడ్‌క్వార్టర్‌గా పరిగణించనున్నట్టుగా 2017 మే నెలలోనే కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం షీలాబిడే కమిటీ సిఫారసును పూర్తిస్థాయిలో ఆమోదించాలని కోరింది. కొన్ని సంస్థల కేసులు కోర్టులో ఉన్నందున పరిష్కారమయ్యేవరకు తదుపరి చర్య తీసుకోవడం సాధ్యంకాదని తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తంచేసింది. హెడ్‌క్వార్టర్ సమస్యకూడా కోర్టు ముందున్నట్టు తెలిపింది.
రాష్ట్ర ఆర్థికసంస్థ పాలకమండలిని పునర్వ్యవస్థీకరించాలని తెలంగాణ ప్రభుత్వం 2016 మే నెలలోనే కేంద్ర హోంశాఖను కోరినా పట్టించుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన పాలకమండలి ఏకపక్షంగా ఈ సంస్థ విభజన ప్రణాళికను తయారుచేసి కేంద్రం ఆమోదానికి పంపింది. ఈ సంస్థకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న 235 ఎకరాల భూమిని తెలంగాణ స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2015 నవంబర్‌లో హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. నానక్రాంగూడంలోని భవనంలో ఏపీ వాటా అడగటం సరికాదని తెలంగాణ వాదించింది. ఏపీ ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకొంటే తప్ప ఎస్ఎఫ్సీ విభజన అంశం పరిష్కారం కాదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై లీగల్ కౌన్సిల్‌కు నివేదించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లోని నగదును ఆయా రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం 48ః52 వంతున ఆస్తులను ఉన్న ప్రాంతం ఆధారంగా విభజించాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. దీనికి కేంద్రం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ మాత్రం ఆస్తులనూ జనాభా నిష్పత్తితో పంచాలని వింత వాదనను తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని కేంద్రం తేల్చటం లేదు.
సింగరేణిలోని 51శాతం ఈక్విటీ తెలంగాణకు దక్కుతుందని, విభజన చట్టంలోనే ఉన్నందున దాని ఆస్తుల విభజన ప్రశ్నే తలెత్తదని తెలంగాణ స్పష్టంచేసింది. ఏపీ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ సింగరేణికి అనుబంధ సంస్థగా ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఈక్విటీని మాత్రమే విభజించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదీ పెండింగ్‌లోనే ఉన్నది.
రాష్ట్ర విభజన చట్టానికి సవరణలు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా, తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. చట్టం చేసిన ఏడేండ్ల తరువాత సవరించాలనడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేసింది. విభజన చట్టంలోని 50, 51, 56 కింద ఉన్న పన్ను విషయాల్లోని లోపాలను సరిదిద్దడానికి, చట్టంలో పేర్కొనని 12 సంస్థలను విభజించడానికి చట్ట సవరణ చేయాలని ఏపీ ప్రతిపాదించింది.
పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని తెలంగాణ ప్రభుత్వం అనేకమార్లు కోరింది. విభజించకపోవటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. కేంద్రం చొరవ తీసుకోకపోవటంతో ఇవన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.