PM Modi | మోదీ మళ్లొస్తుండు.. ఎప్పుడొచ్చినా ఉత్తచేతులతో వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లేసిపోయే ప్రధాని.. ఈసారి కూడా చేతులూపుకుంట వస్తడా? చేతలేమైనా ఉంటయా? అని తెలంగాణ సమాజం ఆసక్తిగా చూస్తున్నది. పదేండ్లనాడు 2014లో పాలుమూరుకొచ్చి వలసల జిల్లాను ఎందుకు బాగుచేయలేదని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు.. పదేండ్ల తర్వాత ఇప్పుడు మళ్లా అదే పాలమూరుకు వస్తున్నడు. మరి ఈ పదేండ్ల పాలనలో నువ్వేం చేసినవ్ మోదీ సారూ అని ఇప్పుడు పాలమూరు ప్రశ్నిస్తున్నది. నీళ్లిచ్చినవా? నిధులిచ్చినవా? అని నిలదీస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘పదేండ్లసంది పగబట్టినట్టు వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ పాలమూరుకు మళ్లొస్తుండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పైసా సాయం చేయని ప్రధాని, కరువు జిల్లాకు ఏకాణా ఇవ్వని మోదీ.. ఇప్పుడు అదే గడ్డపైకి వచ్చి ఏం చెప్తడు? ఇన్నాళ్లూ తెలంగాణపై ఎందుకు కచ్చవట్టినని చెప్తవా? పాలమూరుకు పైసా కూడా ఎందుకు ఇయ్యలేదో చెప్తవా? పాలమూరుకు ప్రాణమైన కృష్ణా నీటిలో తెలంగాణ వాటా ఎందుకు తేల్చలేదో చెప్తవా? ప్రాజెక్టులకు అనుమతులు ఇ య్యకుండా ఎందుకు ఆపినవో చెప్తవా?’ అని పాలమూరు సమాజం ప్రశ్నిస్తున్నది. 2014లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి మహబూబ్‌నగర్‌కు వచ్చిన మోదీ, మళ్లీ ఇప్పుడు ఆ గడ్డకు ముఖం చూపించబోతున్నారు. ఇప్పుడైనా ఏమైనా తెస్తున్నా వా? లేదా? అంటూ పోరుగడ్డ ప్రశ్నిస్తున్నది.
ట్రిబ్యునల్ ఏమాయె?
కృష్ణానీటిలో తెలంగాణ వాటా తేల్చేందుకు అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకా రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని 2014 నుం చి మొరపెట్టుకొంటున్నా మోదీ స్పందించడంలేదు. న్యాయంకోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును వెళ్తే.. ఆ కేసును ఉపసంహరించుకొంటేనే సమస్య పరిష్కరిస్తామని నమ్మబలికి కేంద్రం వెన్నుపోటు పొడిచింది. అక్టోబర్ 6, 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ గట్టిగా అర్సుకొంటే ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించినా, ఆ తర్వాత అడ్డమైన కొర్రీలతో ఇప్పటికీ కాలయాపన చేస్తున్నది. తీరా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటి పంపకాలు చేసే అధికారం తమకు లేవని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 2 చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ ఇటీవలే తేల్చిచెప్పినా మోదీ సర్కారులో ఉలుకూ పలుకూ లేదు.
జాతీయ హోదా ఎందుకు ఇవ్వదు?
తెలంగాణలో ఏదైనా ఒక భారీ నీటిపారుదల ప్రా జెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభు త్వం అడుగుతూనే ఉన్నది. లేదులేదు.. ఎవ్వరికీ ఇచ్చేది లేదని చెప్తూనే కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు కేంద్రం నమ్మకద్రోహం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 జాతీయ ప్రాజెక్టులున్నాయి. ఇందులో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ హోదా ఇచ్చినవి మూడు (పోలవరం, అప్పర్‌భద్ర, కెన్ -బెత్వా) ఉన్నాయి. ‘ఇకపై ప్రాజెక్టులకు జాతీయహోదా ఇచ్చే విధానం ఉండబోదు. ఏ ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇచ్చేది లేదు’ అని నాటి జల్‌శక్తి శాఖ మంత్రి గడరీ ప్రకటించినంక కూడా అప్పర్‌భద్ర, కెన్-బెత్వాకు హోదా ఇ చ్చారు. తెలంగాణకు మొండిచెయ్యి చూపించారు.
45 టీఎంసీల వాటా తేల్చాలి
1974 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తే కృష్ణా డెల్టా ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్ రాష్ట్రాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున కేటాయించాలి. ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువన ఇన్ బేసిన్ ప్రాజెక్టులకు మాత్రమే వినియోగించుకోవాలని. ఈ తీర్పు ప్రకారం ఆ 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే దకుతాయి. కానీ తెలంగాణ తనకు దకాల్సిన 45 టీఎంసీల నికర జలాలను వినియోగించుకొనేందుకు మాత్రం కేంద్రం ఇప్పటికీ అనుమతివ్వడం లేదు. ట్రిబ్యునల్ అవార్డు గోదావరి నదికి సంబంధించినది కాబట్టి దానిని జీఆర్ఎంబీనే పరిషరించాలని కేఆర్ఎంబీ, అవార్డు అమలు కావాల్సింది కృష్ణా బేసిన్లో కాబట్టి కేఆర్ఎంబీనే బాధ్యత వహిస్తుందని జీఆర్ఎంబీ చెప్తూ కప్పదాటు పద్ధతిని అనుసరిస్తున్నాయి.
క్యారీ ఓవర్‌పై చేతులెత్తేసిన కేంద్రం
బచావత్ అవార్డులోని 15వ చాప్టర్ ప్రకారం ఒక వాటర్ ఇయర్లో వాడుకోలేకపోయిన నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసుకొని మరుసటి ఏడాదికి వినియోగించుకొనే అవకాశం ఉమ్మడి ఏపీకి ఉన్నది. కృష్ణా పరీవాహక రాష్ట్రాల్లో ఉమ్మడి ఏపీ అతితకువ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నది కాబట్టి వాడని వాటా జలాలను తదుపరి ఏడాదికి బదిలీ చేసుకునే లా ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ఉమ్మడి ఏపీ పాలకులు కుట్రపూరితంగా తెలంగాణలో నీటి నిల్వకు జలాశయాలను నిర్మించలేదు. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు క్యారీ ఓవర్ అవకా శం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పదేండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నది. కేంద్రం మాత్రం ససేమిరా అంటున్నది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 15వ చాప్టర్ వర్తించబోదని చెప్తూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నది. రాజోలి బండ డైవర్షన్ సీమ్ (ఆర్డీఎస్) ఆనకట్ట హెడ్వర్స్ను కర్ణాటక ప్రభుత్వం నుంచి తొలగించి కృష్ణా రివర్ బోర్డ్ పరిధిలోకి తీసుకోవాలని ఏండ్లుగా కోరుతున్నా పట్టించుకోవటంలేదు.
గెజిట్ నుంచి ‘కల్వకుర్తి’ రెండో భాగాన్ని తొలగించాలి..
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌ను రెండు కాంపోనెంట్లుగా పేరొంటూ కేంద్రం రివర్‌బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ రూపొందించింది. వాస్తవంగా కల్వకుర్తి ఒకే కాంపోనెంట్ అని తెలంగాణ ప్రభుత్వం ఆదినుంచీ స్పష్టం చేస్తున్నది. గెజిట్ నుంచి రెండో కాంపోనెంట్‌ను తొలగించి ప్రాజెక్టు మొత్తాన్ని ఒకే కాంపోనెంట్గా గుర్తించాలని కోరుతున్నది. ఉమ్మడి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నాటి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలుత 2.5 లక్షల ఎకరాలకు 25 టీఎంసీలను ఎత్తిపోసేలా ప్రాజెక్టును రూపొందించగా, ఆటు తరువాత ఆయకట్టును 3.65 లక్షలకు పెంచింది. ఆ మేరకు నీటి కేటాయింపులు మాత్రం పెంచలేదు. తెలంగాణ ఏర్పాటు తరువాత గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెంచిన ఆయకట్టుకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గతంలో అనేకమార్లు స్పష్టం చేసి ఆధారాలతోసహా కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లింది. అయినా కేంద్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఏపీకి చెందిన పలు ప్రాజెక్టులకు మాత్రం మినహాయింపులు ఇస్తూ గెజిట్‌ను సవరించింది.