హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభ్వుత్వం అన్ని విధాల వివక్షను చూపుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రైల్వే సంబంధిత ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడంలో కానీ, రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయడంలో కానీ, రైల్వే లైన్ల పునరుద్ధరణలో కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు.
ఉత్తర, దక్షిణ భారతదేశ రోడ్డు, రైల్వే మార్గాలకు తెలంగాణ రాష్ట్రం ప్రధాన బిందువుగా ఉందని, ఇంతటి కీలక జంక్షన్ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అయిన తెలంగాణలో రైల్వే పరంగా అనేక పనులు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నా, అన్ని రకాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పెద్ద పీట వేస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రం దాహోద్ జిల్లాలో రూ. 21,969 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న రైల్వే లోకో మోటివ్ యూనిట్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు.
వరంగల్ జిల్లాలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇతర ఏదైనా రైల్వే సంబంధిత యూనిట్ ను ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ దారిలోనే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పరంగా పలు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఏర్పాటు కావాల్సి ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను కరేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం వెన్నుపోటు పొడిచి దీనిని గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ కు తరలించిందని వినోద్ కుమార్ ఆరోపించారు.
రైల్వే పరంగా హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- నాగ్ పూర్ రూట్లలో ఇండస్ట్రియల్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ లైన్లను మెరుగు పర్చడం లేదని, హైదరాబాద్ లో ఫార్మా సిటీ, నేషనల్ డిజైన్ సెంటర్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లకు తగిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత విడనాడి తక్షణమే రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని, వివిధ పథకాలకు నిధులను విడుదల చేయాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.