వరంగల్ : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar rao) ఆరోపించారు. ఏటేటా నిధులు తగ్గిస్తూ, నిబంధనలు కఠినంగా విధిస్తూ ఈ పథకాన్ని పూర్తినా నిలిపివేసే కుట్రలు చేస్తున్నదని వెల్లడించారు.
వరంగల్ జిల్లా (Warangal District) పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొత్తూరు, కొండూరు గ్రామాల ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర వైఖరికి నిరసనగా సమర భేరి మోగించాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పాలని , అభివృద్ధిని అడ్డుకుంటున్న వారి ఆగడాలను ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు.
‘ కేంద్రంలో కేసీఆర్(CM KCR) ను అధికారంలోకి తేవాలి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం నిజం కావాలి. దేశంలో రైతే రాజు అనే నానుడి నిజం అవుతూ, ప్రజలు సుభిక్షంగా ఉండే విధమైన పరిపాలన కావాలని’ ఆయన అభిలాషించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా, అడ్డుపుల్ల వేస్తున్నదని దుయ్యబట్టారు. ఈ వైఖరి కారణంగా తెలంగాణ అభివృద్ధి కుంటు పడుతున్నదని అన్నారు.
సీఎం కేసీఆర్(Cheif Minister KCR) నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.