ఖమ్మం, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రామయ్య కొలువుదీరిన భద్రగిరిపై ప్రభుత్వాలు వివక్ష వీడటంలేదు. రాముడు నడయాడిన నేలగా.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల పట్టణంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కేంద్రం సంకల్పించిన స్వీయ జనగణన వెబ్సైట్లోనూ ఈ పట్టణానికి తెలంగాణ తరఫున చోటు దక్కలేదంటే ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శించారనేది స్పష్టమవుతున్నది. ఇటీవల పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వారికి తెలంగాణపై ఎంత వివక్ష ఉందనేది అర్థమవుతున్నది.
వెబ్సైట్లో చోటుదక్కని అంశం భద్రాచలం ప్రాంతవాసులను తీవ్ర నిర్వేదానికి గురిచేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, భద్రాచలం పట్టణంలోని 7 గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన విషయం విదితమే. ఆ ఘటన నుంచి ఇంకా కోలుకోక ముందే భద్రాచలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోనిది కాదంటూ సందేశం రావడంతో పట్టణవాసులు హతాశులయ్యారు.
‘అన్ని పరీక్షలు రామయ్యకేనా? సకల కష్టాలు భద్రాచలం వాసులకేనా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనగణనతోపాటు స్వీయ జనగణనకు సైతం అవకాశం ఇచ్చింది. కుటుంబ యజమానులు తమ వివరాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. భద్రాచలం పట్టణవాసులు స్వీయ గణన కోసం భద్రాచలం పట్టణాన్ని ఎంపిక చేసుకోవడానికి కంప్యూటర్ ద్వారా వెబ్సైట్లో ప్రయత్నిస్తే జియో మ్యాపింగ్‌లో తెలంగాణ రాష్ర్టానికే పరిమితమైందన్న సందేశం వెలువడుతున్నది. దీంతో తాము స్వీయ గణన ఎలా పూర్తి చేసుకోవాలో తెలియక పట్టణవాసులు తలలు పట్టుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎంపిక చేసి.. జియో లొకేషన్లో ఆన్లైన్ నమోదు కోసం తాము నివసిస్తున్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని చూస్తే.. ‘సరిహద్దు ప్రాంతం పరిమితం చేయబడింది.. జియో కోడింగ్ తెలంగాణ ప్రాంతానికే పరిమితం’ అనే సందేశాలు ఆ వెబ్సైట్లో వెల్లువెత్తాయి. వెబ్సైట్లో భద్రాచలం.. తెలంగాణ ప్రాంతం వెలుపల చూపించడంపై తహసీల్దార్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా.. సమస్య తన దృష్టికి వచ్చిందని, ఈ అంశాన్ని జనాభా లెక్కల సాంకేతిక బృందానికి నివేదించినట్టు తెలిపారు. సోమవారం నాటికి సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్‌లో భద్రాచలం పట్టణం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా చూపించడం భద్రాచలం పట్టణవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.