తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం. పంచాయతీరాజ్ శాఖకు అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించారు. సొంత ఇంటి జాగ ఉన్న నిరుపేదలు ఇండ్లు కట్టుకోవడానికి రూ.3లక్షల ఆర్థిక సహాయం, నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇండ్లు కేటాయించటం మంచి నిర్ణయం.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
బడ్జెట్లో అన్నిరంగాలకు ప్రాధాన్యం కల్పించారు. హోంశాఖ పరిధిలోని అన్ని విభాగాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని చేరాయి. అన్నివర్గాల ప్రజలు లబ్ధిపొందుతున్నారు. వాటిని మరింత బలోపేతం చేసేలా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు.
– మహమూద్‌అలీ, హోంశాఖ మంత్రి
రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షల బడ్జెట్. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటు హర్షణీయం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం గొప్ప విషయం. గండిపేట చెరువు పునరుద్ధరణకు రూ.36.5 కోట్లు కేటాయింపు స్వాగతించదగ్గది.
– సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
గిరిజన తండాలను పంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్.. పంచాయతీల భవనాలకు రూ.25 లక్షల చొప్పున రూ.600 కోట్లు, రహదారి నిర్మాణాలకు మరో రూ.1000 కోట్లు కేటాయించడం హర్షణీయం. ములుగు జిల్లాలో అటవీ వర్సిటీకి రూ.100 కోట్లు, మెడికల్ కాలేజీకి మరో రూ.100 కోట్లు, మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించడం కేసీఆర్ పెద్దమనసుకు నిదర్శనం. న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ మహిళలకు వరం. 7 నుంచి 12వ తరగతి విద్యార్థులకు హెల్త్ అండ్ హైజీనిక్ కిట్స్ చరిత్రాత్మకం.
– సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి
గీత కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించడం హర్షణీయం. నీరా పాలసీకి రూ.20 కోట్ల కేటాయింపు గీత కార్మికులకు వరం. త్వరలోనే నెక్లెస్‌రోడ్డులో నీరా కేఫ్ ప్రారంభిస్తాం. తాటి, ఈత చెట్ల పన్ను శాశ్వతంగా రద్దుచేయడం, గత బకాయిలు రూ.8 కోట్లు పూర్తిగా మాఫీ చేయడం గొప్పవిషయం. గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలకు పెంచడం స్వాగతించాల్సిన అంశం.
– వీ శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
బడ్జెట్లో వ్యవసాయానికి అగ్ర తాంబూలం వేశారు. ఈ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సాగుకు రూ.83,989 కోట్లు వెచ్చించారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మే వ్యక్తి కేసీఆర్. అందుకే వ్యవసాయంపై ప్రత్యేక ప్రేమ ఆయనది. గతేడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషం.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయింపు, 1,736 దేవాలయాలకు ధూప దీప నైవేద్యం పథకం వర్తింపజేయడం హర్షణీయం.యాదాద్రితోపాటు అనేక ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. బ్రాహ్మణులపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ప్రస్తుత బడ్జెట్లో సైతం హరితహారం పథకానికి రూ.932 కోట్లు ప్రతిపాదించడం గొప్ప విషయం.
– ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
బడ్జెట్లో దళితుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం కల్పించారు. ఎస్సీలకే 15.49 శాతం నిధులు కేటాయించారు. దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయించారు. గురుకులాలకు అధిక నిధులు కేటాయించడంతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. ఇంగ్లిష్ మీడియంతో తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నారు.
– కొప్పుల ఈశ్వర్, సంక్షేమశాఖల మంత్రి
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. ఆర్టీసీ బలోపేతానికి రూ.1,500 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యం.
– పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి
రాష్ట్ర బడ్జెట్ దేశ చరిత్రలో నూతన ఒరవడిని సృష్టించింది. ఇది ప్రజారంజక బడ్జెట్. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు, మహిళా అభివృద్ధికి పెద్దపీట వేసింది. అన్నదాతల సంక్షేమానికి ప్రముఖ స్థానం కల్పించారు. బీజేపీ రాష్ట్రాల్లో లేని పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి.
– నామా నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత
తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఎకనామిక్ పవర్‌హౌస్‌గా నిలుస్తున్నది. కేసీఆర్ సాధిస్తున్న ప్రగతిని చూస్తూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. రాష్ట్రంలో ఐటీ రంగం తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్నది. తెలంగాణ బడ్జెట్ ఇతర రాష్ర్టాల బడ్జెట్‌ను దాటిపోయింది. రాష్ట్ర బడ్జెట్ రూ.1,00,637 కోట్ల నుంచి ఏడేండ్లలో రూ.2,56,958 కోట్లకు చేరింది. ఇది తెలంగాణ ప్రగతికి సంకేతం.
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
రైతుబంధు పథకం ద్వారా 8 విడతల్లో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. 75 వేల కుటుంబాలకు రైతుబీమా అందజేశాం. రూ.75 వేల రుణమాఫీతో రైతులకు ఉపశమనం కలుగుతుంది. ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించటం హర్షణీయం. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు
రైతుబీమా మాదిరిగా చేనేత కార్మికులకు బీమా ప్రకటించడం సంతోషకరం. సెంటు భూమి లేకున్నా అకాల మరణానికి గురైన చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా కల్పించడం గొప్ప విషయం. చేనేత సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేయడం అభినందనీయం.
-గంజి మధు, చేనేత కార్మికుడు, శాబ్దుల్లాపురం, కనగల్ మండలం, నల్లగొండ
మేము కొబ్బరి బొండాలు అమ్ముకొని బతుకుతున్నం. మాకు ఇంటిజాగ ఉన్నది. పైసలు లేక ఇల్లు కట్టుకోలేకపోయినం. ఇంటి కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నం. ఇల్లు కట్టుకునేటోళ్లకు రూ.3 లక్షలు ఇత్తమని సర్కార్ చెప్పడంతో సంతోషమైతంది.
– బింగి కవిత, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
‘మన ఊరు-మన బడి’ తేవడం గొప్ప పని. అభివృద్ధికి నోచుకోని చాలా పాఠశాలలు ఈ కార్యక్రమంతో కొత్త కళను సంతరించుకొంటాయి. పేద విద్యార్థులకు లాభం జరిగే ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ప్రభుత్వానికి విద్యార్థి, ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు.
– కల్లూరి నర్సింలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సిద్దిపేట
తెలంగాణ బడ్జెట్ దూరదృష్టితో రూపొందించినందుకు అభినందిస్తున్నా. బడ్జెట్లో విద్య, వైద్య రంగాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుంది. రాష్ట్రంలో టీఎస్ఐపాస్, నిరంతర విద్యుత్తు సరఫరా ద్వారా పెట్టుబడులకు అనువైన వాతావరం ఉంది.
– వాగేష్ దీక్షిత్, సీఐఐ అధ్యక్షుడు, తెలంగాణ శాఖ
బడ్జెట్లో అన్ని విభాగాలకు సమప్రాధాన్యం ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) చుట్టూ సర్వీస్ రోడ్డు నిర్మాణానికి రూ.387 కోట్లు కేటాయించడం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది. డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ.12 వేల కోట్లు కేటాయించడం గృహనిర్మాణ రంగంలో కీలక చోదకశక్తిగా పనిచేస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మెరుగుపరిచేలా బడ్జెట్లో కేటాయింపులు చేశారు.
– శాంసన్ ఆర్థర్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్, నైట్ ఫ్రాంక్ ఇండియా