హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ఆమరణ దీక్షతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణను ప్రకటించిన రోజైన డిసెంబర్ 9న ‘విజయ్ దివస్’ను ఘనంగా నిర్వ హించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేయనున్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత ‘విజయ్ దివస్’ కేక్ కట్ చేసి బెలూన్లు ఎగురవేయనున్నారు.
ఈ కార్యక్రమానికి శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. అదేవిధంగా ‘విజయ్ దివస్’ను పురస్కరించుకొని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో మంగళవారం ఉదయం 9 గంటలకు పండ్లు పంపిణీ చేయనున్నారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఢిల్లీని వణికించి ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను సాధించిన రోజు డిసెంబర్ 9 ‘విజయ్ దివస్’ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక తెలంగాణ బిల్లు కోసం పార్లమెంటులో పోరాడిన తీరును గుర్తుచేసుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ త్యాగం చిరస్మరణీయమని అభివర్ణించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలతోపాటు నాటి ఉద్యమ స్ఫూర్తి స్మరించేలా కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు.