హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : లెక్చరర్లు క్లాస్‌కు వచ్చారా? పాఠాలు చెబుతున్నారా? క్లాసులో ఎంత మంది విద్యార్థులున్నారు అని పర్యవేక్షించేందుకు ఇంటర్ విద్యాశాఖ సీసీ కెమెరాలు వినియోగించనున్నది. రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలన్నింటిలో సీసీ కెమెరాలు బిగించనున్నది. ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక కెమెరా చొప్పున.. ఒక్కో కాలేజీలో 12-15 కెమెరాలుంటాయి. వీటితోపాటు ప్రత్యేకంగా 2-3 ఇంటరాక్టివ్ సీసీటీవీలను బిగిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 430 కాలేజీలుండగా, 5,500 సీసీ కెమెరాలు బిగించనున్నారు. ఈ సీసీటీవీ కెమెరాలను నాంపల్లి ఇంటర్‌బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. తరగతి గదిలో లెక్చరర్లు పాఠాలు చెప్పే విధానాన్ని హైదరాబాద్ నుంచే అధికారులు, నిపుణులు పర్యవేక్షిస్తారు. ఇంటరాక్టివ్ సీసీ కెమెరాల ద్వారా తగు సూచనలిస్తారు. లెక్చరర్లు మూడు నెలల కాలానికి టైం టేబుల్‌ను సమర్పించాలి.
ఈ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతున్నాయా? లెక్చరర్లు పాఠాలు చెబుతున్నారా? అని నిఘా పెడతారు. లెక్చరర్లకు సెలవుల మంజూరుపైనా ఆన్లైన్ పర్యవేక్షణ చేస్తారు. లెక్చరర్లు సెలవుపై వెళితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే సెలవు తీసుకోవాలి.. లేదంటే టైంటేబుల్ ప్రకారం పాఠాలు చెప్పాలి. గైర్హాజరవడానికి మాత్రం వీల్లేదు.
‘పిల్లలు కాలేజీకో, స్కూల్‌కో గైర్హాజరయ్యారనుకోండి. సాయంత్రం కల్లా తల్లిదండ్రుల ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఇలా నాలుగైదు రోజులు గైర్హాజరైతే ఏకంగా ఫోన్‌కాలే వస్తుంది. ఈ వ్యవధి వారం దాటితే తల్లిదండ్రులు నేరుగా కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్‌కో, లెక్చరర్లకో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది’ ఇది కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో అనుసరిస్తున్న పద్ధతి. అచ్చం ఇలాంటి హాజరు పర్యవేక్షణ విధానాన్నే రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్)ను అమలుచేయాలని నిర్ణయించారు. విద్యార్థులు కాలేజీకి గైర్హాజరు కాగానే నేరుగా తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ వెళ్లడం ఈ విధానం ప్రత్యేకత. ఎఫ్ఆర్ఎస్ ఉపకరణాల బిగింపునకు టెండర్లు ఆహ్వానించారు. నెలాఖరు కల్లా కాలేజీలన్నింటిలో బిగిస్తారు. విద్యార్థుల హాజరును పర్యవేక్షించడమే కాకుండా తల్లిదండ్రులకు విద్యార్థుల గైర్హాజరు సమాచారాన్ని చేరవేస్తారు.