హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): హద్దులు దిద్దుబాటుకు గురవుతున్నాయి. అవకతవకలకు అందమైన ముసుగుతొడిగే యత్నంలో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. భారమైన పత్తి తేలిగ్గా తరలిపోతున్నది. అనుకున్న వారి కోసమో., ఆశించింది చేజిక్కించుకోవడానికో గానీ కాటన్ సొంత జిల్లాల సరిహద్దులు దాటి పొరుగుకు పరుగులు పెడుతున్నది. నిబంధనలు తప్పుకుంటూ, లెక్కలు తప్పులుగా చూపుతూ కాటన్ దందా కొందరు మిల్లర్లు, అధికారుల హస్తాల్లో చిక్కించుకోవడంతో ఎంతో మందికి అన్యాయం జరుగుతున్నది. ఎవరి నిర్ణయాలో., మరెవరి స్వప్రయోజనమోగానీ సంబంధిత మంత్రి ప్రమేయం లేకుండానే పత్తికొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లర్ల ఇష్టారాజ్యం., కలెక్టర్లు సరే అనడం., సీసీఐకి మార్కెటింగ్ శాఖ లేఖ రాయడం, వెంటనే ఆమోదం రావడం వంటివన్నీ చకచకా సాగిపోతున్న తీరు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. గతంలోని నకిలీ ఓటీఆర్ స్థానంలో ఇప్పుడు ఏదో కొత్తదందా రైతన్న నెత్తిన కుచ్చుటోపి, నకిలీ వ్యాపారులకు కోట్లు తెచ్చిపెట్టే యత్నంగా మారబోతున్నట్టు తెలుస్తున్నది.
నిరుడు నకిలీ ఓటీఆర్లతో రైతుల ముసుగులో వ్యాపారుల పత్తి కొనుగోలు చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డ సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ ఏడాది కూడా మరో కొత్త దందాకు తెరలేపినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒక జిల్లా పత్తిని మరో జిల్లాలో విక్రయించేందుకు అనుమతి ఇస్తూ ‘హద్దుల’ పేరుతో అవకతవలకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తున్నది. అన్ని జిల్లాలకు ఒకే విధంగా ఉండాల్సిన రూల్స్ ను కొన్నింటికి మాత్రమే అన్నట్టుగా మార్చుతున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. మొత్తంగా ఒక జిల్లా మిల్లర్ల కడుపు నింపేందుకు.. మరో జిల్లా మిల్లర్ల కడుపుపై కొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో రైతులు పత్తిని రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉండేది. ఇటీవల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త జిల్లాల పరిధిలోని రైతులు ఆ జిల్లా పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే విక్రయించాలనే నిబంధన తీసుకొచ్చింది. దానిపై అభ్యంతరాలు వ్యక్తంకావడంతో ఆ పరిధిని ఉమ్మడి జిల్లాలకు పెంచగా, ఇప్పుడు ఆ నిబంధన కూడా అతిక్రమిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఒక జిల్లా మిల్లర్లు తమకు పత్తి సరిపోదని కోరితే మరో జిల్లా పత్తిని వారి జిల్లాలో అమ్ముకునే అనుమతులు ఇవ్వడంతో సరిహద్దులు తుడిచిపెట్టుకుపోతున్నాయి.
ఒక జిల్లా పత్తిని మరో జిల్లాలో విక్రయించేందుకు అనుమతులు జారీ చేయడంలో ఇటు మార్కెటింగ్ శాఖ, అటు సీసీఐ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిర్ణయం తీసుకునే ముందు రెండు జిల్లాల మిల్లర్ల అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సి ఉన్నా విజ్ఞప్తి చేసిన మిల్లర్ల అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు.. మరో జిల్లా మిల్లర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తున్నది. జనగామ జిల్లాలో జరిగిన అనుమతి విషయంలో ఇదే జరగడంతో నల్లగొండ మిల్లర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పత్తి జనగామకు తరలితే తమ పరిస్థితి ఏంటని.., మిల్లులను మూసుకోవాలా అంటూ నిలదీస్తున్నారు. ఈ నిర్ణయంతో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లా పత్తిని జనగామ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో విక్రయించేందుకు అనుమతి ఇవ్వడం., మహబూబ్నగర్ జిల్లా పత్తిని రంగారెడ్డిలో విక్రయించేలా అనుమతి ఇచ్చారు. అందుకు సంబంధించి జనగామ జిల్లా జిన్నింగ్ మిల్లర్లు కలెక్టర్కు లేఖ రాయగా కలెక్టర్ మార్కెటింగ్శాఖకు లేఖ రాశారు. లేఖ ఆధారంగా మార్కెటింగ్ శాఖ సీసీఐ సీఎండీకి లేఖ రాసింది. కాగా లేఖలో పేర్కొన్న అంశాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
జనగామ జిల్లాలో 1,26,119 ఎకరాల్లో పత్తి సాగు కాగా 15,12,924 క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. జిల్లాలో 3,500 బేళ్ల కెపాసిటీ కలిగిన 15 జిన్నింగ్ మిల్లులు ఉండగా, ఆ సామర్థ్యాన్ని చేరుకోవాలంటే రోజూ 20 వేల క్వింటాళ్ల పత్తి అవసరం అవుతుందని కోరారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు తమ పత్తిని జనగామ జిల్లాలో విక్రయించేలా అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. మిల్లర్ల కోరిక మేరకు నిబంధనలకు తూట్లు పొడిచి జిల్లా హద్దులు మార్చుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.